Kishan Reddy Fired on Congress For Not Attending Ayodhya Event: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ (Congress) పార్టీ తిరస్కరించడం.. రాజకీయ దృక్పథంతో తీసుకున్న నిర్ణయమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హస్తం పార్టీ ఎప్పుడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని మండిపడ్డారు. ధార్మిక కార్యక్రమాన్ని ఆ పార్టీ బహిష్కరిస్తోందని.. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. 'దేశంలో రోజురోజుకూ ఆధ్యాత్మికత పెరుగుతోంది. అయోధ్యలో (Ayodhya) రామమందిర ప్రతిష్టాపన జరుగుతుంటే వారికి కంటగింపుగా ఉంది. హస్తం పార్టీ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. జనవరి 22 కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు అభద్రతా భావంలో ఉంది.' అని పేర్కొన్నారు.


వారికి బహిష్కరణ అలవాటే


కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించడం అలవాటుగా మారిందని.. అయోధ్య కేసు విచారణ సమయంలోనూ వితండవాదం చేసిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాలను, జీ20 సమావేశాలను, ఎన్నికల కమిషన్ సమావేశాలను హస్తం పార్టీ బహిష్కరించిందని గుర్తు చేశారు. హిందువులకు సంబంధించిన ప్రతీ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. హస్తం పార్టీకి దేశ సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవం లేదని.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకత్వంతో భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తుందని చెప్పారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టకు హాజరవుతున్నట్లు చెప్పారు.


'దానిపై కేసు నమోదా.?'


మరోవైపు, అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తుంటే సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. 'పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి.? కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పి ఏంటి.?' అని నిలదీశారు. వారం రోజుల తర్వాత ఎవరి ఒత్తిడితో కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణంలో సుప్రీం కోర్డు ఆదేశాలను పాటిస్తున్నామని స్పష్టం చేశారు. 'రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఆయన తిరగాలనుకుంటే చైనా బార్డర్, పాకిస్థాన్ బార్డర్, గోవా బీచ్ లో తిరగమనండి. ఎవరు వద్దన్నారు.?' అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అని అన్నారు.


అటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని.. దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని అన్నారు. రాష్ట్రంలో యువతను డ్రగ్స్, మద్యానికి బానిసలుగా మారుస్తున్నారని.. మద్యం ద్వారా సర్కారు ఏటా రూ.40 వేల కోట్లు ఆర్జిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని.. ఇప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు.? అని ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డపైనే జ్యుడీషియల్ విచారణ అంటున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ నేతల తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని దాచి పెట్టేలా ఉందని ఆరోపించారు.


Also Read: Revanth Reddy : రేవంత్ ఢిల్లీ పర్యటన క్యాన్సిల్ - హైకమాండ్‌తో సమావేశం కానున్న భట్టి విక్రమార్క !