BJP Number 2 Target : భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. టార్గెట్ చేశారంటే ఆ పార్టీకి స్పాట్ పెట్టాల్సిందే. ఒక రోజు అటూ ఇటూ అవుతుందేమో కానీ రిజల్ట్ మారదు. అందు కోసం బీజేపీ పన్నే వ్యూహాల్లో చిక్కుకుని ఎందరో నలిగిపోతున్నారు. ఇప్పుడు బీజేపీ రాడార్‌లోకి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వచ్చినట్లుగా భావిస్తున్నారు. రెండు రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కాం సూత్రధారి కవితేనని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి గట్టి కౌంటర్ ఇంకా టీఆర్ఎస్ వైపు నుంచి రాలేదు. పరువు నష్టం దావా వేస్తామని చెబుతున్నారు కానీ అంత కాన్ఫిడెన్స్ టీఆర్ఎస్‌లో కనిపించడం లేదు.
ప్రత్యర్థి పార్టీల్లో నెంబర్ 2ను టార్గెట్ చేస్తున్న బీజేపీ ?
భారతీయ జనతా పార్టీ నేరుగా రాజును కొట్టడం అనే వ్యూహాన్ని ఎప్పుడూ అమలు చేయలేదు. రాజును దెబ్బకొట్టడానికి ఆయువపట్టును కనిపెడుతుంది. ఆ వైపు నుంచి పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. చాలా రాష్ట్రాల్లో అదే జరిగింది. తెలంగాణకు వచ్చే సరికి .. కేసీఆర్ ను దెబ్బకొట్టడానికి రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి కవితను టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కవిత సన్నిహితుల వ్యాపారాలపై నిఘా పెట్టి కొన్ని లూప్ హోల్స్‌ను పట్టుకున్నారని అందులో నుంచే లిక్కర్ స్కాం విషయంలో కవితపై ఆరోపణలు ప్రారంభమయ్యాయన్న వాదన వినిపిస్తోంది. కవిత యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. ఎంపీగా చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలను కవితే సమన్వయపరుస్తున్నారు. అందుకే ఆమెపై ఆరోపణలు రాజకీయం అని తీసి పడేయడానికి అవకాశం లేకుండా చేస్తోంది.
సిసోడియా .. కవితలు లెటెస్ట్ టార్గెట్స్ !
బీజేపీ ప్లాన్ చేస్తే అంతే పక్కాగా ఉంటుంది. నెంబర్ టూను టార్గెట్ చేసి.. నెంబర్ వన్‌ను బలహీనం చేయడంలో ఆ పార్టీ ప్లాన్ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలవుతోంది. తాజాగా ఢిల్లీలోనూ అదే జరుగుతోంది. డిప్యూటీ సీఎం సిసోడియా లేకపోతే కేజ్రీవాల్‌కు కాళ్లూ చేతులూ ఆడవు. ఓ రకంగా ఢిల్లీ పాలనంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది. అలాంటి సిసోడియాను బీజేపీ కార్నర్ చేస్తోంది. లిక్కర్ స్కాంలో గుట్టు బయట పెట్టేసింది. ఆప్ ఇప్పుడు ఆత్మరక్షణలో ఉంది. ఎందుకంటే బీజేపీ ఆరోపణలతో కంగారు పడి ..కొత్త మద్యం పాలసీలను రద్దు చేసుకున్నారు. అక్కడ ఆప్ .. సిసోడియా తప్పు చేశారన్న వాదన బలంగా వినిపించడానికి కారణం అయింది. బీజేపీ స్కోర్ చేసింది. ఢిల్లీలో నెంబర్ టు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. నెంబర్ వన్ కేజ్రీవాల్ టెన్షన్ పడుతున్నారు.
సంజయ్ రౌత్, పార్థాచటర్జీ ఆపరేషన్ల పూర్తి !
తెలంగాణ, ఢిల్లీల్లోనే కాదు.. ఇప్పటికే కొన్ని ఆపరేషన్లు పూర్తయ్యాయి. బెంగాల్‌లో పార్థాచటర్జీ ఉదంతంతో మమతా బెనర్జీ సైలెంట్ అయ్యారు. అప్పటి వరకూ ఆయన దీదీ కేబినెట్‌లో నెంబర్ టూ. కానీ ఆయనకు కనీస మద్దతు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి మమతా బెనర్జీ వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత దీదీ తనకు బెంగాల్ వరకూ చాలన్నట్లుగా ఉన్నారు. జాతీయ రాజకీయాలపై పెద్దగా మాట్లాడటం లేదు. ఇక ఇటీవలే పూర్తి చేసిన మహారాష్ట్ర ఆపరేషన్‌లో సంజయ్ రౌత్ జైల్లో ఉన్నారు. ఆయన శివసేనలో నెంబర్ టూ. ఇప్పుడు శివసేనకు కాళ్లూ చేతులూ ఆడని పరిస్థితి. ఇక కర్ణాటకలో డీకే శివకుమార్ కూడా బీజేపీ రాడార్‌లో ఉన్నారు.
బీజేపీ టాప్ పొజిషన్‌ను కాకుండా.. టాప్ టు పొజిషన్‌ను టార్గెట్ చేస్తుందని ఎవరూ అనుకోరు. కానీ అలాగే చేసింది. టాప్ పొజిషన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం వారికంత ఈజీగా లేదు. అందుకే బీజేపీ రాజకీయం చాలా డేంజరని అనుకునేది.