తెలంగాణలో మరో ఉపఎన్నిక వస్తుంది బీజేపీ తరపున మరో ఆర్ అసెంబ్లీలోకి అడుగుపెడతారంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రఘునందన్ రావు ఆషామాషీగా ఈ వ్యాఖ్యలు చేయలేదని.. ఓ వ్యూహం ప్రకారమే చేశారని నమ్ముతున్నారు. దీంతో అందరి దృష్టి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పడింది. ఆయన ఇప్పటికి చాలా సార్లు బీజేపీ చేరుతానని ప్రకటించి ఉన్నారు. అందుకే ఆయనతో రాజీనామా చేయించి ఉపఎన్నిక తెచ్చి మరోసారి బీజేపీ బలాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : సూర్యాపేట ‘జై భీమ్’ ఘటనలో SIపై వేటు.. ఆయన ట్రాక్ రికార్డ్ అంతా ఇంతే! ఎస్పీ ఉత్తర్వులు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో అటో ఇటో అన్నట్లుగా ఉన్నారు. 2019లోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ వెళ్లిఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే తానే సీఎం అభ్యర్థి అని కొంత మందితో చెప్పుకోవడం.. ఆ ఆడియోలు బయటకు రావడంతో బీజేపీలో ఆయన చేరికకు బ్రేక్ పడింది. ఆయన ఆశించిన స్థానం దక్కదని బీజేపీ నుంచి క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత కాస్త తగ్గారు. కానీ ఇటీవలి కాలంలో మళ్లీ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే వాదన వినిపిస్తున్నారు.
Also Read : ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.. కొద్ది రోజుల్లో నల్గొండలో అదే జరుగుతుందట!
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన అభ్యర్థి దొరకకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా ఆయన భార్యను బరిలోకి దింపాలని బీజేపీ అనుకుంది. కానీ అప్పటికి వర్కవుట్ కాలేదు. హుజురాబాద్ ఉపఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీలో జోష్ వచ్చిందన్న నమ్మకంతో ఉన్న బీజేపీ కోమటిరెడ్డితో రాజీనామా చేయించి ఉపఎన్నిక వచ్చేలా చూసుకుని మరోసారి విజయం సాధిస్తే ఇక తిరుగు ఉండదన్న అంచనాలో ఉంది . ప్రస్తుతం అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ తో పాటు 4ఆర్, 5ఆర్ లు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం వరుసగా వ్యాఖ్యలు బీజేపీ నేతలు చేస్తూ వస్తున్నారు.
ఒక్క మునుగోడు మాత్రమే కాకుండా వేములవాడ ఉపఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అక్కడి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంలో త్వరలో తీర్పు రానుంది. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అనర్హతా వేటు పడుతుంది. ఇప్పటికే వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కానీ అప్పీల్‌కు వెళ్లారు. తీర్పును సమర్థిస్తే అనర్హతా వేటు పడుతుంది. దీంతో అక్కడా ఉపఎన్నిక రావొచ్చంటున్నారు. అందుకే రెండు ఉపఎన్నికలపై చర్చ జరుగుతోంది. అంత వరకూ బాగానే ఉన్నా.. టీఆర్ఎస్ వద్దనుకుంటే మాత్రం ఉపఎన్నికలు రావడం కష్టమే. రాజీనామాలు ఆమోదించడం స్పీకర్ చేతుల్లోనే ఉంటుంది.