Rajasingh What Next : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కానీ బీజేపీ తమ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఈసారి పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందా? పార్టీ సస్పెన్షన్ వేటు తొలగిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేటు ఇలాగే కొనసాగితే రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
సస్పెన్షన్ ఎత్తి వేసే ఉద్దేశంలో లేని బీజేపీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కరుడు గట్టిన హిందూత్వ వాదిగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. పార్టీలో సీనియర్ నేతగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్.. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో మునావర్ ఫారూక్ షో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ ఘాటు విమర్శలు చేశారు. ఓ వీడియో రిలీజ్ చేశారు. రాజాసింగ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమయింది. రాజాసింగ్ పార్టీ లైన్ దాటారని.. సస్పెండ్ ఎందుకు చేయవద్దో చెప్పాలని బీజేపీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. నేరుగా కేంద్ర నాయకత్వమే రాజాసింగ్ పై వేటు వేయడంతో.. రాష్ట్ర నాయకత్వం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
తనకు బీజేపీ మాత్రమే కరెక్ట్ అంటున్న రాజాసింగ్
ఎన్నికల షెడ్యూల్ రావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గోషామహల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీ టికెట్ ఇవ్వకపోతే ఎన్నికల నుంచే తప్పకుంటానని రాజాసింగ్ ఇటీవల తెలిపారు. కాగా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేత అంశంపై కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర పార్టీ చేతుల్లో ఉందని చెబుతున్నారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసినా ఆయన్ను అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించే అవకాశముందనే చర్చ జరుగుతోంది.గోషామహల్ నుంచి మరో నేతకు టికెట్ ఇవ్వాలని ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్ కు ఇవ్వాలని భావి్సతున్నరు. దానికి రాజాసింగ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రాజాసింగ్ తీసుకునే నిర్ణయం బట్టే గోషామహల్ ఫలితం
గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తరాదికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. అలాగే్ ముస్లిం జనాభా కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే హిందువులు మెజార్టీ కావడంతో మజ్లిస్ వ్యూహాత్మకంగా .. అభ్యర్థిని నిలబెట్టుకుండా బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ వస్తోంది. తెలంగాణలో ఉన్న అతి చిన్న నియోజకవర్గాల్లో ఒకటి అయిన గోషామహల్ కు ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ తిరుగులేని నేతగా మారారు. ఆయనకు సొంత ఫాలోయింగ్ ఉంది. ఒక వేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.