Phone Tapping Case Update In Telangana : ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై సిబిఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ రాష్ట్ర బీజేపీ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ రాధాకృష్ణ‌న్ ను కోరింది.  ట్యాపింగ్ కేసు పూర్తి వివరాలతో ముఖ్య నాయకులంతా ఓ లేఖ రాశారు  ఇప్ప‌టికే ఈ కేసులో న‌లుగురు పోలీస్ ఉన్న‌తాధికారులు అరెస్ట్ అయ్యార‌ని  లేఖలో నేతలు తెలిపారు.  మ‌రికొంద‌రు పోలీసుల పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని ..ఈ ట్యాపింగ్ లో గ‌త పాల‌కుల ప్ర‌మేయం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయని గుర్తు చేశారు.  ఈ కేసులో నిజ‌నిజాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను అభ్య‌ర్ధించింది. లేఖ‌పై బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి, ఎంపి ల‌క్ష్మ‌ణ్ తో పాటు బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు సంత‌కాలు చేశారు.                           




ఫోన్ ట్యాపింగ్ కు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. అందుకు సీబీఐకి ఈ కేసును అప్పగిస్తేనే అసలు దోషులు బయటపడతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.  ఫోన్ ట్యాపింగ్ చేయడం అత్యంత దారుణమని అన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిచిందన్న వార్తలు కలవరపెడుతున్నాయన్నారు. సీబీఐకి ఈ కేసును అప్పగించినప్పుడే న్యాయం జరుగుతుందని కె. లక్షణ్ అన్నారు. ప్రభుత్వం కూడా సీబీఐకి అప్పగించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టామ్‌‌ అండ్‌‌ జెర్రీ మాదిరి కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ కొట్టుకుంటున్నాయని సీఎం రేవంత్‌‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.


దేశ భద్రతకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందని, ఇందులో అసలు సూత్రధారులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రధాని మోదీ పదేండ్ల పాలన, అభివృద్ధిపై చర్చ జరగకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం, ధరణి, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలతో ప్రతిరోజు పతాక శీర్షికల్లో వార్తలు వచ్చేలా రేవంత్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ అవినీతిపై కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసిందని, కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ దానిపై ఇప్పటి వరకు విచారణ జరిపించలేదు. ధరణి పోర్టల్ పై కమిటీ వేసి మసిపూసి మారేడుకాయ చేశారు.


మద్యం విక్రయాలు, విద్యుత్ కొనుగోళ్లలోనూ అవినీతి జరిగింది. వాటిపైనా విచారణ జరిపించడం లేదు” అని ఫైర్ అయ్యారు.  ‘‘2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్లలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిందే ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. గవర్నర్ ట్యాపింగ్ అంశాన్ని సీబీఐకి సిఫారసు చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.