Raghunandan Rao complaints to DGP regarding Phone Tapping Case: హైదరాబాద్: దుబ్బాకతో పాటు మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సిద్దిపేట (Siddipet)లో వార్ రూట్ ఏర్పాటు చేసి.. తన ఫోన్‌తో పాటు కుటుంబసభ్యుల ఫోన్లు, మరికొందరు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping Case) చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని డీజేపీని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు.
సీఎం ఆదేశాలు లేకుండా ట్యాపింగ్ జరుగుతుందా?
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తి లేదు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు దుబ్బాక ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న హరీష్ రావు, అప్పటి కలెక్టర్ వెంకటరామిరెడ్డిలను ముద్దాయిలుగా చేర్చాలని డీజీపీని రఘునందన్ రావు కోరారు. ఫోన్ ట్యాపింగ్ డివైస్ లను ఎవరు కొనుగోలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారు. దీనిపై నిష్పక్ష పాతంగా విచారణ జరిపించాలని డీజీపీని కోరినట్లు రఘునందన్ రావు తెలిపారు.
అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లే టార్గెట్‌గా ట్యాపింగ్
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక లో కుమార స్వామికి లబ్ధి చేకూరాలనే ఫోన్లు ట్యాపింగ్ చేశారని రఘునందన్ రావు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను తెలంగాణ కేంద్రంగా ట్యాపింగ్ చేసి సంభాషణలు విన్నారని ఆరోపణలున్నాయి. సబితా ఇంద్రా రెడ్డిపై పోటీ చేసిన బీజేపీ నేత అందెలా శ్రీరాములు యాదవ్ నెంబర్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. రాజకీయ నేతల ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్ కాల్ సంభాషణలు కూడా విన్నారని తెలిసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేడు తెలంగాణకు వస్తున్నారని, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం సీజేఐకి చెప్పాలని కోరారు.
మరిన్ని రంగాల వారి ఫోన్లు ట్యాపింగ్
తెలంగాణ కేంద్రంగా కేవలం రాజకీయ నేతల ఫోన్లు మాత్రమే కాదు, సినిమా రంగానికి చెందిన వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తీర్పులు చెప్పే న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సినిమా వాళ్లను, రియల్ ఎస్టేట్ వాళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి, డబ్బులు వసూలు చేసినట్లు చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బినామీ ఛానెల్ ఓనర్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని.. సమగ్ర విచారణ జరిపించాలని డీజేపీని రఘునందన్ రావు కోరారు. ఒకవేళ పోలీసులు ఈ కేసులో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.