Telangana BJPCandidates: తెలంగాణ బీజేపీ రెండో జాబితాలో  ఆరుగురు తెలంగాణ అభ్యర్థులకు చాన్స్ లభించింది.   మహబూబ్ నగర్‌ అభ్యర్థిగా డీకే అరుణకే చాన్సిచ్చింది హైకమాండ్. దీంతో జితేందర్ రెడ్డి కి షాక్ తగిలినట్లయింది. ఆదిలాబాద్ ఎంపీగా  రెండు రోజుల కిందట పార్టీలో చేరిన గోడం నగేష్‌కు చాన్సిచ్చారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు హ్యాండిచ్చారు.  నల్లగొండ నుంచి  సైదిరెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారామ్ నాయక్, మెదక్ నుంచి రఘునందన్ రావు, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ కు టిక్కెట్లు ప్రకటించారు.  టిక్కెట్లు పొందిన వారిలో నగేష్, సైదిరడ్డి, సీతారామ్ నాయక్ రెండు రోజుల కిందటే పార్టీలో చేరారు. 


 





 రెండో జాబితాలో  మొత్తం 72 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.  తెలంగాణలో ఇప్పటికే 9 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో  ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మల్కాజిగి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవి లత , జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి భరత్, చెవేళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయనున్నారు.                                         


రెండో జాబితాతో కలిసి మొత్తం  తెలంగాణలో పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి.  ఒకటి ఖమ్మం నియోజకవర్గం కాగా.. మరొకటి వరంగల్ నియోజకవర్గం. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పార్టీలో చేరేందుకు  సిద్ధమయ్యారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను ఆపారు. దీంతో కొత్త అభ్యర్థిని వెదుకుతారా లేకపోతే..  ఆరూరినే ఖరారు చేస్తారా అన్నది మూడో జాబితాలో తేలే అవకాశం ఉంది. ఇక ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ నేతలకు పెద్దగా బలం లేకపోవడంతో ఇతర పార్టీల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. రెండు రోజుల కిందట జలగం వెంకట్రావు పార్టీలో చేరారు. అయితే ఆయనకు టిక్కెట్ ప్రకటించలేదు.  మరో కీలక నేత కూడా బీజేపీ తరపున పోటీకి సిద్ధమయ్యారన్న  ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సీట్లకూ బీజేపీ..  మూడో జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.