Telangana BJP : తెలంగాణ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. ప్రధాని సహా దిగ్గజ నేతల పర్యటనలు వరుసగా సాగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కోసం కేంద్ర పార్టీ ఐదు రాష్ట్రాల నుంచి ఇరవై ఆరు మంది ముఖ్య నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 26 మంది నేతలతో కేంద్ర ఎన్నికల కమిటీని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు నియమించడం జరిగింది . ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ ఎన్నికల కమిటీలో సభ్యులు ఉన్నారు. వీరిలో పలువురు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు.
ఆంధ్రప్రేదశ్ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యస్ . విష్ణువర్ధన్ రెడ్డిలు ఈ కీలక కమిటీలో బాధ్యతలు నిర్వహించడానికి జాతీయ పార్టీ అవకాశం కల్పించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన ఉన్న పార్టీ నేతలు ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించబోతున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో విష్ణువర్ధన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రధాని మోదీ సభలను కూడా కోఆర్డినేట్ చేశారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా విష్ణువర్ధన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఉన్న అనువైన పరిస్థితులు ఉన్నాయని అందర్నీ సమన్వయం చేసుకోవడం, అభ్యర్థుల ఎంపిక, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిచడం, ప్రచారం, జాతీయ నేతలు బహిరంగ సభలు నిర్వహణ , ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన సాయం చేయడం వంటి బాధ్యతల్ని ఈ ఎన్నికల కమిటీ నిర్వహిస్తుంది. తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకూ అంటే డిసెంబర్ మొదటి వారం వరకూ ఈ కమిటీ తెలంగాణ పూర్తి సమయం ఉండి రాష్ట్ర , కేంద్ర మంత్రులు పార్టీ జాతీయ నాయకత్వంతో కలిసి పని చేస్తుంది. బీజేపీని రానున్న తెలంగాణ ఎన్నికల్లో విజయపథంలో నడిపేందుకు ఈ కమిటీ పని చేయాలని కేంద్ర పార్టీ నుండి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చూగ్ కేంద్ర జాతీయ కార్యాలయ నుండి కమిటీ లో ఉన్న నేతలకు గురువారం ఆదేశాలు జారీ చేశారు .
ఇప్పటికే తెలంగాణ బీజేపీ గేర్ మార్చే పనిలో ఉంది. వరుసగా అగ్రనేతలు పర్యటించబోతున్నారు. అగ్రనేతలు తెలంగాణ బాట పడుతూ ఎప్పటికప్పుడు కాషాయ పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్ లో పర్యటించారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా.. నేతలతో భేటీ అయి ఎన్నికల కార్యచరణపై చర్చించారు. అంతేకాకుండా.. అధిష్టానం సూచనలను తప్పక పాటించాలని.. ఐకమత్యంతో ముందుకెళ్లాలని.. ఇకపై అగ్రనేతలంతా ఎప్పటికప్పుడు తెలంగాణలో పర్యటిస్తారని కూడా హామీనిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబరు 1న మహబూబ్‌నగర్ వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపడంతోపాటు.. ఎన్నికలకు సిద్ధమయ్యేలా పలు సూచనలు చేయనున్నారు.