Telangana News :   తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దాదాపుగా ప్రతీ రోజూ భారీ సంస్థలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. తాజాగా  ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ జీనోమ్‌ వ్యాలీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.   రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో గురువారం జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంట్‌లో రూ.1800కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.



దీంతో 2500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కొవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్స్ తయారీపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. జీనోమ్‌ వ్యాలీలో బయోలాజికల్‌ – ఈ విస్తరణను ప్రకటించడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.



హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచిందన్న కేటీఆర్‌.. బయోలాజికల్ ఈ విస్తరణతో దీనికి మరింత బలం చేకూరుతుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా పేరు తెచ్చుకుంది. కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్‌లోనే రూపుదిద్దుకుంది. ఇప్పుడు బయోలాజికల్ ఈ భారీ పెట్టుబడితో ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌కు మరింత పేరు రానుంది.