Fake Transgenders Arrested: హైదరాబాద్ మహానగరంలో బెగ్గింగ్ మాఫియా కోరలు చాస్తోంది. నగరంలో మరో బెగ్గింగ్ రాకెట్ ను పోలీసులు గుట్టు రట్టు చేశారు.  ట్రాన్స్  జెండర్ల  వేషంలో బెగ్గింగ్ చేస్తున్న కొందరిని గుర్తించి అరెస్టు చేశారు. వీళ్లంతా బిహార్ కు చెందిన వాళ్ళుగా నిర్ధారించుకున్న పోలీసులు ఈ ముఠా వెనుక ఉన్న ఐదుగురు నిర్వాహకుల్ని సైతం అరెస్టు చేశారు. 
ప్రజలను బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు గుంజుతున్న ఈ నకిలీ ట్రాన్స్  జెండర్లను గురించి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో వీళ్ళు హంగామా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు. 


వీళ్లంతా బిహార్ కు చెందిన వాళ్లని ఈ ముఠాను ఐదుగురు వెనకుండి నడిపిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. హిజ్రాల్లాగా వేషాలు వేసుకొని ఇళ్లకు తిరుగుతూ సిగ్నల్స్ దగ్గర షాపింగ్ మాల్స్ దగ్గర హల్చల్ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు వెల్లడించాల్సి ఉంది.


 ఎవరి దందా వారిదే.....
హైదరాబాదులో వందలాది ట్రాఫిక్ జంక్షన్లు, వేలాది మందిరాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను కొందరు  నకిలీ హిజ్రాలు అడ్డాగా మార్చుకున్నారు. సమాజంలో ఆదరణ కరువై ఇలా జోలె పట్టారని అందరూ భావిస్తుంటారు. కానీ నకిలీ వేషధారణలో ప్రజలను మోసం చేస్తున్నారు. 
చీకటి పడతే ట్రాఫిక్ కూడలిలో వీరి హంగామా  మరీ ఎక్కువగా ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో నకిలీ ట్రాన్స్ జెండర్లను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. 


వీరంతా బిహార్ తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడకు చేరుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పండగలు, ఉత్సవాల సమయంలో ఇలా వెయ్యికి పైగా కుటుంబాలు నెలల తరబడి ఇక్కడే మకాం వేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. వీరందరిని గుర్తించినందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు. హిజ్రాల పట్ల ఉండే దయ జాలి గుణాలను మాయగాలు సొమ్ము చేసుకుంటున్నారు. ఉసిలే కట్టు బొట్టు మార్చుకొని నకిలీ హిజ్రాలుగా తయారై కూడలలో వాహనదారులను భయపెట్టి వసూలు చేస్తున్నారు.  కాదంటే అసభ్యంగా ప్రవర్తించి నరకం చూపుతున్నారు. ఇటీవల నకిలీ ట్రాన్స్ జెండర్ లు బెగ్గింగ్ వృత్తిలో ఉంటూ ప్రజలను అనేక ఇబ్బందుల గురి చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.


ఇలా సిగ్నల్స్ దగ్గర వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు గత కొన్ని రోజుల నుంచి వారిపై నిఘా ఉంచారు. వీరు నకిలీ వేషాలతో ప్రజలను ఇబ్బందుల గురి చేస్తున్నారని గుర్తించి పక్క సమాచారంతో వీరిని పట్టుకున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.  మహానగరంలో పోలీసులు ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్, ఇక ఇతర రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచి నకిలీ ట్రాన్స్ జెండర్లు ఉన్నారా అని అరా తీస్తున్నారు.  ఇలా రోజుకు వీరు ప్రజల నుంచి ఎంతవరకు వసూలు చేస్తున్నారు.  వాటిని ఎక్కడికి మళ్ళిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.