Bharat Bundh Live News: భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది... రైతు సంఘాలు ప్రకటన

తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా భారత్ బంద్‌కు సంబంధించి జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 27 Sep 2021 07:53 PM
భారత్ బంద్ ప్రశాంతం

దేశవ్యాప్తంగా భారత్​ బంద్ ప్రశాంతంగా ముగిసింది.​ తమ పోరాటానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్​ ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించింది. దిల్లీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దిల్లీ- గురుగ్రామ్​ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతులు రైల్వే ట్రాక్​లపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. పంజాబ్‌-హరియాణా సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిని రైతులు దిగ్భందించారు. హరియాణా రోహ్‌తక్‌, కర్నాల్‌ ప్రాంతాల్లోనూ ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను రైతన్నలు అడ్డుకున్నారు.

వైసీపీ బంద్‌కు మద్దతివ్వడాన్ని తప్పుబట్టిన బీజేపీ

నెల్లూరు జిల్లా కావలిలో భారత్ బంద్ ప్రశాంతంగా మొదలైంది. కాంగ్రెస్, వామపక్షాలు, తెలుగుదేశం, పార్టీల నాయకులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యతిరేకంగా  రూపొందించిన చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించేలా పెట్రోలు డీజల్‌ ధరల పెంపును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మోదీ, అమిత్ షా.. దేశ ఆర్థిక వ్యవస్థను, దేశ ప్రజలను అదాని, అంబానీలకు తాకట్టు పెట్టేలా చట్టాలను చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికార వైసీపీ బంద్‌కి మద్దతివ్వడాన్ని బీజేపీ తప్పుబట్టింది.

రాస్తారోకోతో 2 కిలో మీటర్లు నిలిచిన వాహనాలు

ఖమ్మం జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ జరుగుతుండగా.. జిల్లాలో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఖమ్మం బైపాస్‌ రోడ్డుపై కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

హైదరాబాద్‌లో అఖిలపక్ష నేతల ధర్నా

హైదరాబాద్‌ జీడిమెట్ల డిపో ఎదుట అఖిలపక్షం నేతలు ధర్నా చేపడుతున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌లో కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ చేపడుతూ నాయకులు నిరసన చేపట్టారు. గద్వాలలో కూడా ఆర్టీసీ బస్ డిపో ఎదుట అఖిలపక్షం నాయకులు ఆందోళన చేపడుతున్నారు. భారత్ బంద్‌కు మద్దతుగా డిపో ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. యాదగిరి గుట్టలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. భారత్‌ బంద్‌కు మద్దతుగా హన్మకొండలో నిరసన చేస్తున్నారు. పోలీసులు, వామపక్ష నేతల మధ్య తోపులాట ఏర్పడగా.. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

నిరసనకారుల అరెస్టు

భారత్ బంద్ సందర్భంగా నాగర్‌ కర్నూర్‌లోని కొల్లాపూర్‌ బస్టాండ్‌ ఎదుట అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కోదాడ, మిర్యాలగూడలో కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కోదాడ బస్ డిపో ఎదుట కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్, వామపక్షాల నిరసన చేపట్టాయి.

భారత్ బంద్‌కు పలు పార్టీల మద్దతు

రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా బంద్‌లో పాల్గొనాలని సంయుక్త కిసాన్‌ మోర్చా విజ్ఞప్తి మేరకు బంద్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ సహా విపక్షాలు రైతులతో కలిసి బంద్‌లో పాల్గొంటామని ప్రకటించాయి. కాంగ్రెస్‌, ఆప్‌, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఈ మేరకు ప్రకటించాయి. రైతుల ఆందోళన దృష్ట్యా ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇండియా గేట్‌, ముఖ్య ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరించారు. నిరసన శిబిరాల నుంచి ఢిల్లీలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంద్‌లో పాల్గొంటున్నట్లుగా కాంగ్రెస్‌, వైసీపీ సహా టీడీపీ ప్రకటించాయి.

హుజూరాబాద్‌లో ఆందోళన

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) తలపెట్టిన భారత్‌ బంద్‌కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‎లో ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళన చేస్తున్నారు. బస్‌లు బయటకు రాకుండా నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.

Background

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఈ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. భారత్‌ బంద్‌కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా భారత్ బంద్‌కు సంబంధించి జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.