Monkeypox : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంకీ పాక్స్‌ కలకలం రేగింది. మణుగూరు మండలంలోని విజయనగరం గ్రామానికి  చెందిన ఓ విద్యార్థిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.  మధ్యప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థి ఇటీవల సొంత ఊరుకు వచ్చారు. విద్యార్థిలో జ్వరం, ఇతర మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో అతడ్ని వైద్యాధికారుల సూచనలతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ కు పంపించారు.  


భారత్ లో మంకీపాక్స్ కేసులు 


భారత్ లో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దిల్లీలో నైజీరియా మహిళకు బుధవారం మంకీపాక్స్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.  దీంతో దిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరాయి.  భారతదేశంలో ఇప్పటి వరకు 9 మంకీపాక్స్ కేసులు గుర్తించారు. నైజీరియాన్ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించిన  వైద్యులు ఆమెను దిల్లీలోని  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె విదేశీ పర్యటన చేసినట్లు సమాచారం లేదు. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న కారణంగా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు  జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తిని ఇతరుల నుంచి వేరుచేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించాలని, లేదా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం, రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మాస్క్‌ ధరించాలని సూచించింది. చేతులకు డిస్పోజబుల్ గ్లోవ్స్‌ ధరించాలని, చుట్టుపక్కల పర్యావరణాన్ని శానిటైజ్ చేయాలని మంత్రిత్వ శాఖ సూచిస్తుంది.  


పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన యూఎస్ 


ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అయితే తాజాగా అమెరికా కూడా మంకీపాక్స్ ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అమెరికాలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుదలతో బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో అనూహ్య స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతోందని, కట్టడి చర్యలు బలోపేతం చేస్తున్నామని యూఎస్ వైద్యాధికారులు ప్రకటించారు. ఇప్పటికే దాదాపు 7 వేల మంది అమెరికన్లు మంకీపాక్స్ బారిన పడినట్టు అంచనా. ఇకపైనా కేసులు పెరిగే ప్రమాదముందని గుర్తించిన ఆరోగ్య విభాగం ఎమర్జెన్సీని అమల్లోకి తీసుకొచ్చింది.


మంకీపాక్స్‌ కట్టడికి అవసరమైన వ్యాక్సిన్లు, మందుల్ని వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటితో పాటు అత్యవసర నిధులు విడుదల చేసి, అదనపు వైద్య సిబ్బందిని నియమించుకోవాలని భావిస్తోంది బైడెన్ ప్రభుత్వం. వాషింగ్టన్, న్యూయార్క్, జార్జియాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీరిలో 99% మంది బాధితులు పురుషులే ఉన్నారు. అది కూడా పురుషులు, పురుషులతోనే శృంగారం చేసిన వారిలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని న్యూయార్క్‌ టైమ్స్ పేర్కొంది. నిజానికి మంకీపాక్స్ వ్యాక్సిన్ సరఫరా విషయంలో బైడెన్ యంత్రాంగంపై విమర్శలు వస్తున్నాయి. చాలా మంది బాధితులకు వ్యాక్సిన్‌లు అందటం లేదనే అసంతృప్తి నెలకొంది. న్యూయార్క్ సహా శాన్‌ ఫ్రాన్సిస్కోలో మంకీపాక్స్ రెండు డోసులు అందని వారు చాలా మందే ఉన్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాక్సిన్‌ల సరఫరా పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించటం వల్ల ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.