వివిధ రాజకీయ పార్టీల్లోని అసంతృప్తులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా తమ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి రావాలనుకుంటే భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ఆహ్వానిస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడే రామచంద్రయాదవ్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల సంగ్రామంలోకి దిగేందుకు బీసీవై పార్టీ సిద్దమైంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 70 లో జర్నలిస్ట్ కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు చెప్పారు. బీసీవై రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా పని చేస్తుందని, ఉచిత తాయిలాలు కాకుండా అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. నవంబర్ 1న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.


ఒంటరిగానే పోటీ


తెలంగాణలో ఏ రాజకీయ పార్టీతో పొత్తుతో వెళ్లే ఆలోచన లేదని, ఒంటరిగానే బీసీవై పార్టీ పోటీ చేస్తుందని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీని 2, 3 రోజుల్లో నేతలతో చర్చించి వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, మహిళల అభివృద్ధి, భద్రత కోసం ఏం చేయాలనే దానిపై పూర్తి స్పష్టతతో ముందుకు వస్తామని తెలిపారు. ఏపీలో బీసీవై పార్టీ ఆవిర్భవించినప్పటికీ తెలంగాణలోనూ తమ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 


పేదలకు అండగా


బీసీవై పార్టీ అంటే ఒక వర్గానికో, కులానికో, ప్రాంతానికో పరిమితమైన పార్టీ కాదని రామచంద్ర యాదవ్ అన్నారు. బలహీన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పోటీ చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల ఓట్లు చీల్చడానికే బీసీవై పార్టీ వచ్చిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో తమ పార్టీ పని చేస్తుందన్నారు. తెలంగాణలో మెజార్టీ వర్గాలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని అన్నారు. త్వరలో మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లబోతున్నామని తెలిపారు. బీసీవై పార్టీ ముందు, వెనుక ఏ రాజకీయ పార్టీ నాయకులు లేరని స్పష్టం చేశారు.