Barrelakka Nomination in Nagar Kurnool: తెలంగాణలో గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ కు చెందిన ఆమె ఆ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. తాజాగా బర్రెలక్క మరోసారి పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా నేడు (ఏప్రిల్ 23) నామినేషన్ వేశారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఉన్నారు.
కొన్నేళ్ల క్రితం బర్రెలక్క ఓ షార్ట్ వీడియోతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. తాను డిగ్రీ చదివినా ఉద్యోగం రాలేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానని కర్నె శిరీష్ ఓ వీడియో పెట్టింది. ఆ వీడియోతో శిరీష్ ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి శిరీష బర్రెలక్కగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో నిరుద్యోగ సమస్యపై ఆమె మాట్లాడుతూనే ప్రశ్నిస్తూనే వచ్చారు. అలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ వేయడం సంచలనం అయింది. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీగా మద్దతు లభించింది. వీవీ లక్ష్మీ నారాయణ సహా పలువురు ప్రముఖుల నుంచి ఆమెకు ఆర్థిక సాయం అందడంతో పాటుగా ఎన్నో ప్రశంసలు కురిపించారు.
ఆ ఎన్నికల ప్రచార సమయంలో మీడియా సైతం బర్రెలక్క ప్రచారాన్ని కవర్ చేసింది. ఆమెకు ఎన్నికల సంఘం సెక్యూరిటీని కూడా నియమించింది. మొత్తానికి ఆ ఎన్నికల్లో బర్రెలక్క ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో కొల్లాపూర్ లో ఆమెకు 5,754 ఓట్లు పడ్డాయి. అలా ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేస్తానని బర్రెలక్క చెప్పారు. అప్పుడు చెప్పినట్లుగా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ వేశారు.