Bandi sanjay : ప్రధాని మోదీ సభలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ను కొద్ది సేపు విమర్శించిన తర్వాత ఆయన మొత్తం ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. మోదీ ది బాస్…. ప్రపంచమే పాదాభివందనం చేస్తున్న మహానుభావుడు ఈ ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వాగతం అన్నారు. 6 వేల 100 కోట్ల నిధులతో అభివృద్ది పనులకు ముఖ్యంగా కరీంనగర్ –వరంగల్ జాతీయ రహదారుల పనులు ప్రారంభించేందుకు వచ్చిన మోదీకి ధన్యవాదాలు అన్నారు.
తెలంగాణకు నిధులిచ్చేందుకే మోదీ వచ్చారు..!
కొంతమంది ఏ ముఖం పెట్టుకుని మోదీ వచ్చారని అడుగుతున్నారు… 6 వేల 100 కోట్ల నిధులతో అభివృద్ది పనులు ప్రారంభించేందుకు వచ్చారన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కేఎంసీ ఆసుపత్రికి నిధులు మంజూరు చేస్తూ వచ్చారన్నారు. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు వచ్చారన్నారు. స్మార్ట్ సిటీ నిధులిచ్చినందుకు వచ్చారన్నారు. కేసీఆర్…..మోదీ నీ దోస్త్ అన్నవ్ కదా ? నువ్వెందుకు రాలేదు ? రావడానికి నీకు ముఖం లేదు… నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ, అభివృద్ధి చేయాలని ఉంటే ఇక్కడికి రావాలి కదా… మోదీ వస్తే కేసీఆర్ కు కోవిడ్ వస్తది… బిజీ అవుతారని సెటైర్ వేశారు. నరేంద్రమోదీకి ప్రజలంతా లేచి చప్పట్లు కొట్టాలి… మీరు జై మోదీ అనే నినాదాలతో కేసీఆర్ చెవుల నుండి రక్తం కారాలని పిలుపునిచ్చారు.
బీజేపీకి రుణపడి ఉంటా !
సాధారణ కార్యకర్తగా ఉన్న తనను అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా, కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చిన బీజేపీకి రుణపడి ఉంటా…శిరస్సు వంచి దండాలు పెడుతున్నానన్నారు. బీజేపీ జెండాను మోసిన భుజం అన్నా… 140 కోట్ల మంది ప్రజలకు భరోసా ఇచ్చే మహానుభావుడు భుజం తడితే ఎట్లా ఉంటదో ఈ భుజాన్ని అడిగితే చెబుతుందన్నారు. ఒక్కసారి మోదీ నోటి నుండి సంజయ్ అని ఎప్పుడంటారా ? అని ఎదురుచూసిన… కానీ నన్ను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు దండాలు.. తమ జాతీయ నాయకత్వం నన్ను అధ్యక్షుడిని చేసిందన్నారు.
మోదీ తన భుజం తట్టడం పూర్వజన్మ సుకృతమన్న బండి సంజయ్
మోదీ తన భుజం తట్టి బండి అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇది తన పూర్వ జన్మ సుకృతతమన్నారు. ఈ జన్మకు ఇది చాలు… రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ సర్కార్ గడీలను బద్దలు కొడతామన్నారు. తెలంగాణలో మోదీ రాజ్యం… కాషాయ రాజ్యం స్థాపించేందుకు నిరంతరం క్రుషి చేస్తామన్నారు. బండి సంజయ్ తనను బీజేపీ చీఫ్ గా తొలగించడంపై అసంతృప్తికి గురయ్యారని.. కేంద్ర మంత్రి పదవి వద్దన్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ాయన చేసిన ప్రసంగం పార్టీ నేతల్ని ఆశ్చర్యపరిచింది. మోదీని ప్రసస్నం చేసకోవడానికే బండి సంజయ్ ప్రయత్నించారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.