Bandi Sanjay : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు. దేవాలయం వద్ద స్నానం చేసి... తడిబట్టలతో దేవాలయంలోకి వెళ్లి దేవుడి ఎదుట ప్రమాణం చేశారు. అర్చకుల వద్ద బండి సంజయ్ ప్రమాణం చేస్తూ.. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫామ్‌హౌజ్ డీల్ తమది కాదని చెప్పేందుకే ప్రమాణం చేసినట్టు బండి సంజయ్ స్పష్టం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ డైరెక్షన్ లో ఫాంహౌజ్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. స్వాధీనం చేసుకున్న రూ. 15 కోట్లు ఏమయ్యాయని సంజయ్ ప్రశ్నించారు.
బండి సంజయ్ యాదాద్రి పర్యటన లో హై టెన్షన్ నెలకొంది. సంజయ్ కు వ్యతిరేకంగా స్థానిక టీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను యాదాద్రి వెళ్లి తీరతానని ముందుగానే చెప్పిన సంజయ్ అక్కడికి చేరుకుని ప్రమాణం చేశారు. మరోవైపు తెలంగాణలో రెండు రోజుల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.
ఇంకా ప్రగతి భవన్‌లోనే నలుగురు ఎమ్మెల్యేలు
మరో వైపు రోహిత్ రెడ్డి సహా ఈ డీల్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. ఫామ్ హౌస్‌లో కేసు బయటపడిన రోజున వారు ప్రగతి భవన్‌కు వెళ్లారు అక్కడే ఉండిపోయారు. వారి ఫోన్లు కూడా స్విచ్చాగిపోయాయి. అయితే రేగ కాంతారావు పేరుతో ఫేస్ బుక్‌లో పోస్టులు వస్తున్నాయి. ఇవాళ కేసీఆర్ ప్రెస్మీట్ పెడతారని ఆయన చెప్పారు. ాకనీ కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ రోజునే ఎమ్మెల్యేలతో కలిసి మీడియా ముందుకు వస్తారన్నారు. రాలేదు. గురువారం వస్తారన్నారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లి .. ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెడతారన్నారు. కానీ ఆయన మాత్రం ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదు. టీఆర్ఎస్ వీలైనంత వరకూ ప్రజల్లో ఈ ఆడియో టేపులు ప్రచారం చేయాలనుకుంటోంది. వీడియోలు కూడా రిలీజ్ చేస్తారో లేదో కానీ.. చట్ట పరంగా తేల్చుకోవడం కన్నా.. ప్రజల్లో బీజేపీని బద్నాం చేస్తే చాలన్నట్లుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్న అఙిప్రాయం వినిపిస్తోంది.
నిందితుల రిమాండ్ రిపోర్ట్ కొట్టి వేయడంపై హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు
మరో వైపు ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్ రిపోర్టును కొట్టివేయడంపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చినట్టుగా సరైన ఆధారాలు లేవంటూ నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారణ జరపాలని స్పష్టం చేశారు. దీంతో నిందితులు రామ చంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు విడుదల చేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పుపై సైబరాబాద్ పోలీసులు అప్పీల్ చేశారు. అరెస్ట్ ను రిజెక్ట్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటీషన్ లో కోరారు. మరోవైపు నిబంధనల మేరకు పోలీసులు, నిందితులకు 41A సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు.