ఢిల్లీ మద్యం విధానం అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. లిక్కర్ దందాను కేసీఆర్ ఏకీకృతం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అంటున్న మూడో కూటమి లిక్కర్ ఫ్రంట్ అని విమర్శించారు. పంజాబ్, బెంగాల్, ఢిల్లీ వెళ్లింది లిక్కర్ చీకటి ఒప్పందాల కోసమే అని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. రామచంద్రపిళ్లై, శరత్, సృజన్ రెడ్డి, అభిషేక్‌లు కేసీఆర్ బినామీలేనని అన్నారు.
అందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు: బండి సంజయ్
దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవానికి లిక్కర్ ఫ్రంట్ పెట్టేందుకే ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నేతలతో చీకటి ఒప్పందం చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. లిక్కర్ మాఫియాతో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు. పంజాబ్ లోని డ్రగ్స్ ను తెలంగాణకు విస్తరింపజేయడానికి, తెలంగాణలోని లిక్కర్ సామ్రాజ్యాన్ని పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలకు విస్తరింపజేసుకునేందుకే పరస్పర చీకటి ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. రామచంద్ర పిళ్లై, శరత్, సృజన్ రెడ్డి, అభిషేక్ కేసీఆర్ కుటుంబ బినామీలని అన్నారు. లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరుపుతోందని, త్వరలోనే కుటుంబం బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు.
అందుకే చెప్పులు అందించా: బండి సంజయ్
అమిత్ షాకు చెప్పులందించడంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై బండి సంజయ్ ధ్వజమెత్తారు. అమిత్ షా పెద్దాయన అని గురువు అని తనకు షా తండ్రిలాంటి వారని పేర్కొన్నారు. చెప్పులందిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గురుద్వారాలో చెప్పులు శుభ్రం చేస్తాం. పాదయాత్రలో ఓ పెద్దావిడ పోలియోతో ఇబ్బంది పడుతుంటే చెప్పులు తొడిగా.. తప్పేముంది? అయినా అమిత్ షా, మోదీను కలిసేందుకు వారిని టచ్ చేసేందుకు ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే వారిని స్పర్శిస్తే దేశభక్తి ఎక్కవవుతుంది. ఎంతో ధైర్యం కలుగుతుంది. అదే 'కేసీఆర్ ను తాకితే ఏమొస్తది.. మందు, సిగరేట్ వాసన తప్ప’ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
మద్యం కుంభకోణంతో సంబంధాలు..
'ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ వెళ్తున్నది లిక్కర్ దందా కోసమే. లిక్కర్ సిండికేట్ చేసి, తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇప్పించడానికే వెళ్తున్నార. లిక్కర్ ఆదాయం రూ.4000 కోట్ల నుంచి, రూ.30 వేల కోట్లకు పెంచారు. లిక్కర్ దందా బండారం బయటపడుతుందనే భయంతో కేసీఆర్ ఈడీ... ఈడీ అంటున్నారు. డ్రగ్స్ మద్యం...ఇలా అన్నింటిలో టీఆర్ఎసోళ్లే ఉన్నారు' అని బండి సంజయ్ తెలిపారు.
కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్..
'ఢిల్లీ లో ఒబేరాయ్ హోటల్ లో లిక్కర్ మాఫియాతో కలిశారా..? లేదా..?. పిళ్ళై పెట్టిన ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్ళారా...? లేదా..అరుణ్ రామచంద్రయ్య పిళ్ళై శరత్, సృజన్ రెడ్డి, అభిషేక్ తో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందా..? లేదా..? కేసీఆర్ సమాధానమివ్వాలి' అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఊరికో 10 బెల్టు షాపులు..
'ఊరికో 10 బెల్టు షాపులు, వైన్స్, బార్ షాపులతో మద్యాన్ని ఏరులై పారుతుంది. తెలంగాణలో లిక్కర్ తయారు చేసి పంజాబ్ లో అమ్ముతరు. అక్కడి డ్రగ్స్ ఇక్కడ అమ్ముతరు. యువతను మద్యానికి బానిసలను చేస్తుండు. బెంగాల్, పంజాబ్ లో ట్రై చేశారు. అర్ధ రాత్రి లిక్కర్ షాప్(టానిక్) ను తెరిచేందుకు... నడిపేందుకు ప్రత్యేక జీవో ఇచ్చారు' అని బండి విమర్శించారు.
వారి 'హస్తం' ఉంది..
'తన కుటుంబం సభ్యులపై ఆరోపణలు వస్తే...ట్విట్టర్ టిల్లు ఎక్కడికి పోయారు? ఢిల్లీ లిక్కర్ దందా లో కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా హస్తం ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే.. లిక్కర్ దందా చేస్తున్నాయి. శరత్ ఎవరి బంధువు?. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వాటా ఉంది. ఇద్దరూ పంచుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందా..? లేదా..? సీఎం సమాధానం చెప్పాలి' అని బండి సంజయ్ అన్నారు.