కేసీఆర్ తన స్వార్థం కోసం యాగాలు చేస్తారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాత్రం దుర్గాదేవి, సీతాదేవి అమ్మవార్లను, శ్రీరామచంద్రుడిని అవమానపరుస్తున్న మునావర్ ఫారూఖీ వంటి వారిని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారని అన్నారు. దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ  నాయకులు నియంత, కుటుంబ, అరాచక పాలనతో దేశాన్ని పట్టి పీడించారని అన్నారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఏమిటో చూపించిన మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి అని.. జయంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘సుపరిపాలన దినోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు.  


పార్టీ జెండాను నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి వాజ్ పేయి అని బండి సంజయ్ చెప్పారు. నరేంద్రమోడీ సైతం వాజ్ పేయి బాటలోనే నడుస్తూ పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తలను నమ్ముకుని పనిచేస్తూ రెండుసార్లు ప్రధాని అయ్యి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నేటి తరం నాయకులు, కార్యకర్తలు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బండి సంజయ్ అన్నారు.





 


'అద్వానీ, వాజ్ పేయి అత్యంత స్నేహపూర్వక సంబంధాలు అందరికీ ఆదర్శం. గులాబీ చెట్టుకు పూలు-ముళ్ల మాదిరిగా వాజ్ పేయి-అద్వానీ స్నేహ బంధాలుండేవి. పూలు సుగంధాన్ని వెదజల్లితే...ఆ పూలకు రక్షణ కవచం ముల్లు. ఈ రెండింటి తల్లి ‘చెట్టు వేరు’ మాదిరిగానే అద్వానీ-వాజ్ పేయిది ఎవరూ విడదయలేని బంధం.’అని బండి సంజయ్ అన్నారు. 


 ‘అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తా చాటిన నేత వాజ్ పేయి. కార్గిల్ యుద్దంలో విజయం సాధించి పాకిస్తాన్  ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టారు. భారత్ తో విదేశీ సంబంధాలను మెరుగు పర్చిన నాయకుడు వాజ్ పేయి. దుష్ట కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం బీజేపీపై అనేక విమర్శలు చేసినప్పటికీ... నమ్ముకున్న సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటామని ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు నెరిపిన నాయకుడు. ఐక్య రాజ్యసమితిలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రసంగించిన గొప్ప నేత.’ అని బండి సంజయ్ స్మరించుకున్నారు. 


అంతకుముందు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ... వాజ్ పేయి జయంతిని పండుగలా నిర్వహించుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరవేసుకోవడం ఆనందంగా ఉంది. నేటి తరానికి, భావి తరాలకు వాజ్ పేయి చరిత్రను వివరించాల్సిన అవసరం ఉంది. వాజ్ పేయి చాలా అరుదైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు..  అని కొనియాడారు.


Also Read: Telangana Govt: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం


Also Read: Madhavi Latha On Pawan: పవన్ కల్యాణ్ పై మాధవీలత సంచలన కామెంట్స్... మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు...


Also Read: TRS On Teenmar Mallana: తీన్మార్ మల్లన్నకు చెంప దెబ్బలు కాదు చెప్పు దెబ్బలు కొట్టాలి... రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం విష సంస్కృతి... బాల్క సుమన్ ఫైర్