Bandi Sanjay challenges KTR to swear on Taping: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడంపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.  నేను ఏం తప్పు చేప్పిన? సాక్షాత్తు మీ చెల్లెలు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు కదా? ఆమెకు లీగల్ నోటీసులిస్తారా? రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో  కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పారు కదా? ఆ విషయం  కోర్టు ముందుంది.  ఆయనకు నోటీసులిస్తావా? అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే కేసీఆర్, ఆయన కొడుకు ఎప్పటికీ జైల్లోనే ఉంటారని అన్నారు.  వాళ్లు తిట్టని తిట్లు లేవు. మాట్లాడని బూతుల్లేవు. చేయని తప్పులు లేవు. జరపని అవినీతి లేదు... నోటీసులిస్తే.. ఏం చేయాలో తనకు తెలుసని బండి సంజయ్ అన్నారు.  

ఒక రాజకీయ నాయకుడివై ఉండి నేరుగా ఎదుర్కొనే దమ్ములేక చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీసులతో బెదిరించాలనుకోవడం అంతకంటే మూర్ఖత్వం లేదని విమర్శించారు.  ఆ  నోటీసులకు భయపడే వ్యక్తిత్వం నాది. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లో రాలేదు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి జైలుకు పోయి వచ్చినోడినని గుర్తు చేశారు.  

ఏ గుడికి అంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా... నువ్వు కూడా నీ భార్యా, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి గుడికి వస్తావా? వచ్చి ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు? అని ప్రమాణం చేయిస్తావా?... నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నేను, నా కుటుంబ సభ్యులంతా ప్రమాణం చేస్తాం. నీకు ఆలయంపై నమ్మకం లేదంటే మసీదు, చర్చికైనా వెళదాం. ప్రమాణానికి సిద్ధమా? నా సవాల్ కు స్పందించాలని కోరుతున్నానన్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, రోషం ఉంటే ఆ పార్టీని వదిలి బయటకు రావాలి. ఎందుకంటే ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుసహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు. అయినా మీరు ఇంకా ఎట్లా బీఆర్ఎస్ లో ఉంటున్నారో అర్ధం కావడం లేదన్నారు.

ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలనే విషయంలో మాకు స్పష్టత ఉంది. ఎందుకంటే సిట్ పరిమితి చాలా తక్కువ. ఎందుకంటే మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖుల, సినీ తారల, వ్యాపారుల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్  చేసి వసూళ్లకు పాల్పడ్డారు. ఆ డబ్బుల లావాదేవీలకు సంబంధించి పూర్తిస్థాయి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే.. ఈడీ మాత్రమే విచారణ చేస్తేనే అది సాధ్యమవుతుంది. అట్లాగే టెలికం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించింది. ఇది పూర్తిగా కేంద్ర పరిధిలోని అంశం... ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావును నియమించడం కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే ఎస్ఐబీ చీఫ్ గా నియమితులైన వ్యక్తి ఐజీ స్థాయి అధికారి అయి ఉండాలి. కానీ ప్రభాకర్ రావు అప్పటికే రిటైర్డ్ అయ్యారని గుర్తు  చేశారు.   ప్రభాకర్ రావు ఐజీగా కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖకు కేసీఆర్ తప్పుడు సమాచారమిచ్చి ఎస్ఐబీ చీఫ్ గా నియమించారు. అట్లాగే జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ పోలీసులు ఆధారాలతోసహా వెల్లడించారు. జడ్జీలకు నోటీసులిచ్చి పిలిచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసే అధికారం సిట్ కు ఉందా? అది జరిగే పనికాదు.   ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రుల ఫోన్లను కూడా గత ప్రభుత్వం ట్యాప్ చేసింది. ఆ ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయన్నారు. 

భార్యభార్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు మీరు. అసలు ఎస్ఐబీ దేని కోసం పనిచేయాలి? మావోయిస్టుల కదలికల కోసం పనిచేయాలి కదా? ఎంతో మంది ఎస్ఐబీ అధికారులు మావోయిస్టుల చేతిలో బలయ్యారని తెలియదా? అని ప్రశ్నించారు.  సిట్ అధికారులపై మాకు నమ్మకం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసుసహా అనేక కేసుల్లో విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని  బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులిచ్చి విచారణ జరపాలని కోరుతున్నానన్నారు.