Bandi Sanjay : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎంఐఎం హైదరాబాద్ ఓల్డ్ సిటీని న్యూసిటీగా ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. రజాకార్లు పాల్పడ్డ దారుణాల నేపథ్యంలో తెరకెక్కిన రజకార్ సినిమాపై అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరమని అన్నారు. కరీనంగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న జనగర్జన సభకు విపరీతమైన స్పందన వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. బీజేపీ గ్రాఫ్ తగ్గినట్లుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మత్రమే ఉందని.. అలా ప్రజలు భావించడం వల్లే దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మమ్మల్ని ప్రజలు ఆదరించారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరిగింది. నిధులు కేంద్రానివి.. సోకులు రాష్ట్రానివి విమర్శించారు. ధాన్యం కొనేది కేంద్రం. ప్రతి గింజా మేము కొంటున్నామని రాష్ట్రం అబద్ధాలు చెబుతోందన్నారు. ఉపాధి హామీ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభు్తవానివేనని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకున్నారని రైతులు పంట నష్టపోతే పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. అవినీతి, అరాచకాలు, కబ్జాలు చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ. 5 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు.. రూ. 10 లక్షల కోట్లు అవుతుందన్నారు.
స్మార్ట్ సిటీ, మున్సిపాలిటీలకు ఇస్తున్న నిధులు ఎవరివి..? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన ఇండ్లను కట్టకుండా మోసం చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాతీయలకు, కార్పొరేషన్లకు ఇచ్చిన నిధులు చూపాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్ పేరుపై టాయిలెట్ల నిర్మాణాలను కూడా కేంద్రమే కట్టిస్తోందన్నారు.
కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుంది?కరీంనగర్‌లో పోటీ చేయాలని ఉందని నా కోరిక చెప్పా. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తా’’ అని బండి సంజయ్ వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ రైతు బంధు పథకం ప్రవేశ పెట్టి.. అన్ని సబ్సిడీలను తొలగించిందని చెప్పారు. కౌలు రైతులు ఏం పాపం చేశారని వారికి రైతు బంధు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీని తట్టుకోలేకే టీఆర్ఎస్ కాస్తా.. బీఆర్ఎస్ అయ్యిందన్నారు. టూరిస్ట్ మాదిరిగా కేసీఆర్.. దేశంలో తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.