Telangana BJP :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొనాలని తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కేసీఆరేనని.. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రధాని మోదీని అడగాలని సంజయ్ సూచించారు. ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటే గజమాలతో సత్కరిస్తానన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారికంగా ఖరారైన షెడ్యూల్‌లో  ప్రధానితో పాటు కేసీఆర్ కూడా పాల్గొంటారని ఉంది. కానీ కేసీఆర్ మోదీ పర్యటనకు హాజరు కావడం లేదని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ప్రకటించారు. 


బండి సంజయ్‌ను పరామర్శించిన తరుణ్ చుగ్ 


మరో వైపు బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కరీంనగర్‌లో పరామర్శించారు.   తెలంగాణలో అలీబాబా నలబై దొంగల పాలన నడుస్తుందని మండిపడ్డారు. . ఇటీవల మరణించిన బండి సంజయ్ అత్తకు నివాళులర్పించేందుకు తరుణ్ చుగ్ ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కరీంనగర్ లోని బండి నివాసానికి వెళ్లారు..  అక్కడ చెట్ల వనజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బండి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ అదేశాల మేరకే రాజ్యాంగ విరుద్ధంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేశారన్నారు.టీఎస్పీఎస్సీ లీకుల్లో సీఎం కేసీఆర్ హస్తం ఉందని  బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్  ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ తో కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు.  


తప్పులు కప్పి పుచ్చుకోవడానికి కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ 


తెలంగాణ మంత్రి వర్గం ఆలీబాబా 40 దొంగలుగా తయారైందని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లిక్కర్  మాఫియా, లీకేజీ మాఫియా నడుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని..ప్రజా సునామీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయన్నారు.


బండి సంజయ్ వారియర్ అని తరుణ్  చుగ్ కితాబు              


పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని, రాజ్యాంగ బద్దంగా ఉంటామని ప్రమాణం చేశారని తరుణ్ చుగ్ గుర్తు చేశారు  నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వం అహంకారంగా వ్యవహరిస్తుందని, ఎంపీకే వారెంటు లేకుండా అరెస్ట్ చేశారని, సామాన్యుని పరిస్థితి ఏమిటని అన్నారు. కేసీఆర్ కుటుంబ రాజ్యం నడుస్తుందన్నారు. నిరుద్యోగుల కోసం బండి పోరాటం ఆగదన్నారు. లిక్కర్ మాఫియా లూటీ మాఫియాతో పాటు పేపర్ లీక్ మాఫియా నడుస్తుందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి బండిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుటుంబ సభ్యుల్ని తరుణ్ చుగ్ పరామర్శించారు.   బండి సంజయ్ తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ బండి సంజయ్ ను వారియర్ గా అభివర్ణించిన తరుణ్ చుగ్.