ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ సమీపంలో డీఏఈ కాలనీలో నివాసం ఉండే వరద శివ అనే వ్యక్తిది స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరు. 31 ఏళ్ల వయసున్న శివ ఎన్‌ఎఫ్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. వర్క్ అసిస్టెంట్‌గా ఏడేళ్ల నుంచి పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ప్రభావతితో పెళ్లైంది.. వేదాంష్‌ అనే ఏడాదిన్నర కుమారుడు కూడా ఉన్నాడు. 


మొబైల్‌లో ఎప్పుడూ ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం ఆయనకున్న అలవాటు. అదే ఇప్పుడు ఆ ఫ్యామిలీని నట్టేట ముంచింది. ఎప్పుడూ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడే శివ... లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులు చేసి మరీ గేమ్స్‌లో పెట్టాడు. ఇలా అప్పులు మీద అప్పులు చేశాడు. చివరకు వాటిని తీర్చే దారి లేక సూసైడ్ చేసుకున్నాడు. 


భార్యను వారం రోజుల క్రితం వాళ్ల పుట్టింటికి పంపించాడు. తరచూ ఉదయాన్నే భార్యకు ఫోన్ చేసే శివ ఇవాళ ఫోన్ చేయలేదు. అయితే భార్య చాలాసార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. కంగారు పడ్డ భార్య వాళ్ల అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌కు సమాచారం ఇచ్చారు. తన భర్త ఫోన్ తీయడం లేదని ఓ సారి ఇంటికి వెళ్లి చూసి రమ్మని చెప్పారు. ఆయన ఇంటికి వెళ్లి చూస్తే లోపలి నుంచి గడి పెట్టి ఉంది కానీ ఎన్నిసార్లు బెల్‌మోగించినా తీయకపోవడంతో అనుమానం మరింత ఎక్కువైంది. 


ఏం జరిగిందో అని తెలుసుకునేందుకు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే షాక్ అయ్యారు. బెడ్‌రూంలో ఫ్యాన్‌కు శివ వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వాచ్‌మెన్‌ బంధువులకు ఇన్ఫామ్ చేశాడు. శివ మరణ వార్త తెలుసుకున్న భార్య, బంధువుల హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. గదిలో సూసైడ్ నోటు కూడా పోలీసులకు లభించింది. 


అందులో తన బాధను చెబుతూ అందరికీ క్షమాపణలు కోరాడు శివ. వేదాంష్‌ నీ కోసం నేను ఏం చేయలేకపోతున్నాను.. నా మైండ్‌ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా చావుకు నేనే కారణం. అందరూ నన్ను క్షమించాలి. వేరే దారి లేక ఈ నిర్ణయం తీసుకున్నాని లెటర్‌లో రాసి పెట్టాడు శివ. 


గతంలో కూడా ఇలా ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి లక్షల్లో అప్పులు చేశాడని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. అయితే వాటిని ఏదోలా డబ్బులు సర్ది తీర్చామని తెలిపారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డారని స్మార్ట్ ఫోన్‌ తీసేసే నార్మల్‌ ఫోన్ ఇచ్చినప్పటికీ తన వ్యసనాన్ని మానుకోలేదని బోరుమంటున్నారు.