Balka Suman slams TPCC Chief Revanth Redy: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ రేవంత్ రెడ్డి జోకర్‌లా మాట్లాడుతున్నారని, ఆయనకు భాష పరిజ్ణానం లేకుండా పోతోందన్నారు. పార్టీ కీలక నేతగా గౌరవం పొందాల్సిన ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలని బాల్కసుమన్ సూచించారు. చంచల్ గూడ చిప్పకూడు తిన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి చిప్ దొబ్బిందని వ్యాఖ్యానించారు.


తెలంగాణ సమాజంతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం రేవంత్ రెడ్డి మాటలకు నవ్వుకుంటున్నారని, ఇకనైనా ప్రవర్తన మారాలని.. లేకపోతే భరతం పడతామని హెచ్చరించారు. కావాలంటే రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించాలని, అందుకు కావాల్సిన వైద్య ఖర్చులను తామే భరిస్తామని బాల్క సుమన్ చెప్పారు. తీరు మారకపోతే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రేవంత్ రెడ్డికి ఉరి తాడుగా మారతారని హచ్చరించారు. 


ఇటీవల ఏం జరిగిందో రేవంత్ రెడ్డి గమనించలేదా.. ?
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ దారుణమైన వ్యాఖ్యలు చేసిన సమయంలో, పార్టీలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలవడం రేవంత్ రెడ్డి గమనించలేదా అని ప్రశ్నించారు. బీజేపీ నేత అలాంటి వ్యాఖ్యలు చేస్తే, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు పార్టీల నేతలు అస్సాం సీఎం వ్యాఖ్యలను ఖండించారు. కానీ రాష్ట్ర ప్రజలు దేవుడిగా చూస్తున్న కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని, తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 


రేవంత్ నోరు తెరిచారంటే వేలకోట్లు అవినీతి, స్కీములు, స్కాములు తప్ప ప్రజల గురించి ఏ విషయాలు మాట్లాడరు. పీసీసీ చీఫ్ ఇకనైనా చీప్ కామెంట్లు మానుకుని, హుందాగా ప్రవర్తించారని బాల్క సుమన్ సూచించారు. కాంగ్రెస్ నేతలకు ఎలాగైతే తాము గౌరవం ఇస్తున్నామో, అదే తీరుగా నడుచుకుంటే అందరికీ మంచిదన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పనిచేస్తుందని, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు కలిగించవద్దని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. ముందుగా కాంగ్రెస్ నేతలు ఐకమత్యంగా ఉంటూ ఇతరులకు నీతులు చెప్పాలన్నారు.


Also Read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభం, 550 కిలో మీటర్లు కాలినడక


Also Read: KCR, PK And Prakash Raj: ఫామ్‌హౌస్‌లో పీకే, ప్రకాష్ రాజ్ ! కేసీఆర్ నేషనల్ స్ట్రాటజీ మామూలుగా లేదుగా ?