Cash Seize: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు, బంగారు, వస్తువులు పట్టుబడుతున్నాయి. అయినా పెద్ద మొత్తంలో డబ్బు తరలుతూనే ఉంది. పోలీసులు కొన్ని సార్లు చేజింగ్‌లు చేస్తున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఓ కార్‌లో తరలిస్తున్న 50 లక్షల రుపాయలను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు నుంచి పెద్ద ఎత్తున డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన బాలానగర్ ఎస్ఓటీ బృందం డబ్బు తరలిస్తున్న వాహనాన్ని వెంబడించారు. బౌరంపేట్లోని ఓక్రిడ్జ్ స్కూల్ వద్ద కార్‌లోని 50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. కారులో తరలిస్తున్న రూ.50 లక్షలు బిల్డర్‌కు చెందినదిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోదాడలో..
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కోదాడలో సోమవారం రూ.10 లక్షల నగదు పట్టుబడింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సీఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రూ.10 లక్షలను గుర్తించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కమీలే, భావన వ్యాపార నిమిత్తం నగదును తీసుకెళ్తున్నారని, సరైన ఆధారాలు చూపకపోవడంతో నగదును ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించినట్లు తెలిపారు.
రూ.1.34లక్షలు స్వాధీనం..
చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్‌పేట గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు సోమవారం రూ.1.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన శ్యామలరావు హైదరాబాద్ నుంచి స్వస్థలానికి కారులో వెళ్తుండగా వాహనాల తనిఖీల్లో పోలీసులకు నగదు పట్టుబడింది. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పట్టుబడిన నగదును నల్లగొండలోని ఎస్‌టీఓ కార్యాలయంలో జమ చేశామని సీఐ ఎస్ దేవేందర్ తెలిపారు.
నిజామాబాద్‌లో 25 లక్షలు స్వాధీనం
నిజామాబాద్ నగరంలో సోమవారం నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ కిరణ్ తెలిపిన వివరాల మేరకు సీఐ నరహరి నాలుగో టౌన్ ఎస్సై సంజూ ఎల్లమ్మ గుట్ట సమీపంలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మోర దీపక్ అనే వ్యక్తి తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ నగదును ఐటీ అధికారులకు అప్పగించనున్నట్టుగా ఏసీపీ కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
మేడ్చల్ పరిధిలో
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు నగదు సీజ్ చేశారు. ప్రయాణికులు సరైన పత్రాలతోనే డబ్బు వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు.
రూ.500 కోట్లు దాటిందట
ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే రాష్ట్ర సరిహద్దుల్లో 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీల్లో సరైన వివరాలు లేని నగదు, ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. భారీ ఎత్తున స్వాధీనమైన సొత్తు మొత్తం ఇప్పటికే గత ఎన్నికల రికార్డును ఎప్పుడో అధిగమించింది. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.500 కోట్లు దాటిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు.