Balamuri Venkat and Mahesh Kumar Goud Congress MLC candidates : కాంగ్రెస్ పార్టీ మార్క్ ట్విస్టులు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా  ఖరారులో కనిపించాయి. ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ పేర్లను ఖరారు చేసినట్లుగా మంగళవారం వారికి ఏఐసీసీ నుంచి సమాచారం వచ్చింది. అయితే బుధవారం రిలీజయిన జాబితాలో మాత్రం బలమూరి వెంకట్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఉంది. దీంతో అద్దంకి దయాకర్ కు షాక్ తగిలినట్లయింది. అద్దంకి దయాకర్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లేదా వరంగల్ ఎంపీ టిక్కెట్ ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


అసెంబ్లీ ఎన్నికల్లోనూ అద్దంకి దయాకర్ సీటు విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. అదే తరహాలో ఎమ్మెల్సీల ఎంపికలోనూ.. చివరి వరకు ఆయన రేసులో ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. కాంగ్రెస్ అధిష్టానం.. అద్దంకి దయాకర్ ను కాదని.. మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయటం విశేషం. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున బీఫారాలు పంపిణీ చేసే బాధ్యతను కాంగ్రెస్ అధినాయకత్వం జగ్గారెడ్డికి ఇచ్చింది. ఈ మేరకు ఆయన బీఫారాలు వీళ్లిద్దరికీ ఇవ్వనున్నారు. 


మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నిజామాబాద్ కు చెందిన ఆయన కొంత కాలంగా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ కోసం ప్రయత్నించారు కానీ టిక్కెట్ లభించలేదు. దాంతో ఆయన ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆయన సన్నిహితుడన్న పేరు ఉంది. అయితే సీఎం పేర్లను ఖారారు చేసి దావోస్ కు వెళ్లిన సమయంలో అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ పేర్లు ఉన్నాయని.. రేవంత్ ప్రమేయం లేకుండానే మహేష్ కుమార్ గౌడ్ పేరు వచ్చి చేరిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.                                            


అద్దంకి దయాకర్‌కు నల్లగొండ జిల్లాలో కొంత మంది సీనియర్ నేతలు  వ్యతిరేకంగా ఉన్నారు. ఈ కారణంగానే ఆయనకు టిక్కెట్ లభించలేదన్న ప్రచారం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తే దళిత కోటాలో ఆయనకు మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యం అండదని అందుకే హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయన బలమైన అభ్యర్థిగా భావించి  వరంగల్ లోక్ సభ కు నిలబెట్టాలన్న ఆలోచనలో హైకమాండ్ ఉందని చెబుతున్నారు. మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలను గవర్నర్ కోటాలో నియమించాల్సి ఉంది. రాజకీయ నేతల్ని సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించే అవకాశం లేదు కాబట్టి అద్దంకి దయాకర్ కు ఈ సారికి ఎమ్మెల్సీ పదవి మిస్ అయినట్లేనని  చెప్పవచ్చు. గవర్నర్ కోటాలో సియాసత్ పత్రిక జర్నలిస్టు అమీర్ అలీఖాన్ తో పాటు కోదండరాం పేర్లను పరిశీలిస్తున్నారు.