Autos Allowed To Yadadri Hill: యాదాద్రిలో భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి కొండపై వరకూ ఆటోలను అనుమతించనున్నట్లు తెలిపింది. దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైకి ఆదివారం ఆటోలను అనుమతించారు. ఈ మేరకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా కలెక్టర్, డీసీపీ, ఆలయ ఈవో, ఇతర అధికారులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, డీసీపీ, ఈవోలను ఆటో ఎక్కించుకుని ఎమ్మెల్యే స్వయంగా కొండ వరకూ నడిపారు. కాగా, యాదాద్రి ఆలయ పునరుద్ధరణ తర్వాత వాహనాల రద్దీ, పర్యావరణ చర్యల్లో భాగంగా కొండపైకి ఆటోలను అనుమతించలేదు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించింది. ఒకవేళ, కార్లు కొండపైకి వెళ్లాలంటే పార్కింగ్ ఫీజు రూ.500 చెల్లించాలి. ఆటోలను అనుమతించక పోవడంపై గతంలో ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. తమకు ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఎమ్మెల్యే ఐలయ్య అధికారులతో చర్చలు జరిపారు. సాధ్యాసాధ్యాలను సమీక్షించిన ప్రభుత్వం ఆటోలను కొండపైకి అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






అలాగే, యాదాద్రి కొండపై మెరుగైన వసతి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఐలయ్య తెలిపారు. త్వరలోనే కొండపై దుకాణాలు కోల్పోయిన వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం యాదాద్రి టెంపుల్ అభివృద్ధి పేరుతో వెయ్యికి పైగా కుటుంబాలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. గత పాలకులు రెండేళ్లుగా ఆటోలను కొండపైకి అనుమతించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేశారని.. ఇప్పుడేమో వారి గురించి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు. యాదాద్రి అభివృద్ధిలో భారీ అవినీతి జరిగిందని, ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపించాలని కోరుతామని చెప్పారు.


Also Read: Medaram Jatara 2024: వనదేవతలను దర్శించుకున్న సీతక్క - అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి