Delhi liquor Scam :   ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత మాజీ ఆడిటర్   బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు పంపింది. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యలయానికి బుచ్చిబాబు వెళ్లారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు బుచ్చిబాబును మరోమారు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన బుచ్చిబాబు ..  సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ పై బయటకు వచ్చారు.ఈ కేసులో  సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనపై అభియోగాలు మోపాయి. దీంతో ఈ కేసులో బుచ్చిబాబును ఈడీ, సీబీఐ అధికారులు వేర్వేరుగా విచారించారు.                                         


బుచ్చిబాబు అప్రూవర్‌గా మారారన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఆయన ఇచ్చిన నసమాచారంతోనే ఇటీవల ఈడీ మూడో చార్జిషీటు వేసిందని  భావిస్తున్నారు. మనీలాండరింగ్, హవాలా వ్యవహారాల్లో కల్వకుంట్ల కవిత పాత్ర కీలకమని పేర్కొంది.  అరుణ్ పిళ్లైకి కవితనే డబ్బు సమకూర్చినట్లు ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్‌లో కవిత ప్రతినిధిగా పిళ్లై, రాఘవ ప్రతినిధిగా ప్రేమ్ మండూరి వ్యవహరించారని చెప్పింది. అరుణ్ పిళ్లైకి కవితనే డబ్బు సమకూర్చారని తెలిపింది. మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రూ.192 కోట్లతో హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేశారని ఈడీ చార్జిషీట్‌లో తెలిపింది.                 


హైదరాబాద్ లో మూడు స్థలాలను కవిత కొనుగోలు చేశారని.. తమకు ఉన్న పలుకుబడితో తక్కువ ధరకే వాటిని కొనుగోలు చేసినట్లుగా ఈడీ చార్జిషీట్‌లో తెలిపింది.  చార్జిషీట్లో కవిత భర్త అనిల్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది.   భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది.  చార్జిషీట్‌లో కవిత సన్నిహితులంటూ కొంత మంది పేర్లను చేర్చిది.   చార్జి షీట్ లో ఫినిక్స్ శ్రీహరి పేరు కూడా ఉంది. ఆయన భూములు కొనడంలో సహకరించారని  ఈడీ తెలిపింది. అలాగే వి. శ్రీనివాస రావు, సృజన్ రెడ్డి  పేర్లను చేర్చింది ఈడీ. ఇండో స్పిరిట్ కు తన వాటాను అరుణ్ పిళ్లై ద్వారా కవితనే డబ్బులు ఇచ్చినట్లు పేర్కొంది.                                
 
కవిత బినామీ అని ఈడీ ఆరోపిస్తున్ న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మార్చి 6న అరెస్ట్ చేసింది. కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని.. ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున  కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ.  కవిత విచారణ సమయంలోనే తన ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా ఇటీవల సీబీఐ విచారించింది. ఇటీవలే 9 గంటల పాటు సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు ఆడిటర్ బుచ్చిబాబును మరోసారి విచారణకు పిలవడంతో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.