Bhadrachalam EO attacked by Land Mafia: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి పై పురుషోత్తపట్నంలో దాడి జరిగింది. ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూములను ఆక్రమణ నుండి కాపాడేందుకు రమాదేవి ఆలయ సిబ్బందితో కలిసి వెళ్లిన సమయంలో జరిగింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నం గ్రామం ఉంది. ఈ గ్రామంలో భద్రాచలం ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూమి ఈ ప్రాంతంలో ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆలయ ఆస్తిగా గుర్తించారు. అయితే ఈ భూములను కొంత మంది ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన ఆలయ ఈవో రమాదేవి, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి, పురుషోత్తపట్నం వెళ్లారు. ఆలయ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ భూములు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నందున, ఆక్రమణదారులను తొలగించడంలో ఆలయ అధికారులు గతంలో కూడా ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు.
ఈ క్రమంలో ఆలయ ఈవో స్వయంగా వెళ్లారు. ఆలయ భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానిక ఆక్రమణదారులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం తీవ్రమై, ఆక్రమణదారులు రమాదేవిపై దాడికి పాల్పడ్డారు. దాడి కారణంగా రమాదేవి స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది , స్థానికులు ఆమెను వెంటనే భద్రాచలం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు, అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో ఆమె కోలుకున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై దేవాదాయ మంత్రి కొండా సురేఖ స్పందించారు. దేవుడి భూములు రక్షించే ఈవోలపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా... రూల్స్ విరుద్ధంగా ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్టు పెడుతాం.... ఈ విషయంలో గతంలోనూ తాము స్పష్టం చేశామని హెచ్చరించారు. భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఏపీ)లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవిపై దాడి చేయడం సహేతుకం కాదని.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం.... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని... సమస్యను పరిష్కారం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉంది. పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవటం లేదు.