Assembly Elections: తెలంగాణ సహా ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరిపేందుకు కేంద్రం ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీల గడువు ముగియనుంది. ఈ ఏడాది చవరి నాటికి ఈ ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే అధికారులు బదిలీలు, పోస్టింగులకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అధికారులు ఎవరూ తమ సొంత జిల్లాల్లో పని చేయకుండా చూడాలాని ఆదేశించింది. అలాగే గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల నుంచి ఒకే జిల్లాలో పని చేస్తున్న వారిని, 2024 జనవరి 31వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్న వారిని సైతం బదిలీ చేయాలని సూచించింది.
వచ్చే జూలై 31వ తేదీ లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ ఏదైనా కారణం చేత బదిలీ చేయడం కష్టం అయితే అందుకు కారణాన్ని సీఈఓ ద్వారా తెలియజేస్తే అవసరమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎన్నికల విధుల్లో భాగమయ్యే అధికారులు తమకు అభ్యర్థులు, రాజకీయ నేతలతో ఎలాంటి దగ్గరి బంధుత్వం లేదని, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీకి రెండు రోజుల ముందులోగా డిక్లరేషన్ సమర్పించాలని ఆదేశించింది. క్రిమినల్ కేసులు ఎదుర్కుంటున్న వ్యక్తులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. 2013 డిసెంబల్ 17వ తేదీ వరకు మిజోరం ఎన్నికల గడవు ముగుస్తుండగా.. ఛత్తీస్ గఢ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ, మధ్యప్రదేశ్ వచ్చే ఏడాది జనవరి 6వ తేదీ, రాజస్థాన్ వచ్చే ఏడాది 14వ తేదీ, తెలంగాణ వచ్చే ఏడాది జనవరి 16వ తేదీకి ముగియనుంది.
80 ఏళ్ల పైబడిన వారికి ఇంటి నుంచే ఓటేసే అవకాశం
ఎన్నికల సంఘం ఇటీవలే కీలక సంస్కరణ వైపు అడుగులు వేసింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు కోసం ఇంటి నుంచి ఓటు(Vote For Home) సదుపాయం అమలుచేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ సదుపాయాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేశారు. తొలి సారిగా 80 ఏళ్లు పైబడిన వారికి ఎన్నికల సంఘం ఈ సదుపాయం కల్పించగా.. చాలా మందే ఈ అవకాశాన్ని వాడుకున్నారు. ఎన్నికల సిబ్బంది ఫారం-12డితో ఓటర్ల వద్దకు వెళ్తాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారు పోలింగ్ కేంద్రానికి రావాలని కోరాతమని, అలా రాలేనివారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
దివ్యాంగులకు ప్రత్యేక యాప్
దివ్యాంగుల కోసం సాక్షం అనే ఓ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు సీఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ యాప్‌లో లాగిన్ అయి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎంచుకోవచ్చని వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పేపర్లు, అఫిడవిట్లను సమర్పించేందుకు "సువిధ" అనే యాప్‌ను రూపొందించినట్లు ఈసీ తెలిపింది. ఈ యాప్ నుంచి అభ్యర్థులు తమ ప్రచార ర్యాలీలు, సభలకు అనుమతులు కూడా పొందవచ్చని వెల్లడించింది. కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మే 24తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. త్వరలోనే ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశాలున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.