నిర్మల్: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా అభివృద్ధికి నిధులు కేటాయించిందని, అయినా ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతూనే ఉందని అసోం సీఏం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అభివృద్ధి పరిచిన జాతీయ రహదారులపైనే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాదయాత్రలు చేపడుతున్నారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప బస్సు యాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 
తెలంగాణలో బీజేపీ బలోపేతం..
విజయ సంకల్ప యాత్ర 5,500 కిలోమీటర్ల మేర సాగనుందని, మూడోసారి ముచ్చటగా మోదీనే ప్రధానమంత్రిగా చేసి, దేశం అభివృద్ధి పథంలో సాగాలనే ఉద్దేశంతో యాత్ర కొనసాగుతుందని హిమంత బిశ్వశర్మ తెలిపారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందని 2018 సంవత్సరంలో 6.8 శాతం ఓట్లు సంపాదించగా, 2023 లో 14.9 అయిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వీళ్ల పాలన రజాకార్ల పాలనని, దీన్ని అంతం చేసే రోజులు వస్తున్నాయన్నారు. భారత ప్రజలు కాంగ్రెస్ ని తరిమి మోదీని తీసుకొచ్చారని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ రామ మందిరం కలను సాకారం చేసిందన్నారు. ప్రస్తుతం ప్రజలు మోడీని 3వ సారి ప్రధానిగా తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మోదీదేనని కొనియాడారు. 




గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతుందని, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఊసే లేదని అన్నారు. ప్రధాని మోదీ మాత్రం పక్కాగా హామీలను నెరవేర్చి వ్యక్తి అని కొనియాడారు. అసోం రాష్ట్రంలో పెట్రోల్ 98 రూపాయలు కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై టాక్స్ వేసి 110 రూపాలకు ఇస్తూ ప్రజలపై భారాన్ని వేస్తున్నారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదని, ప్రపంచ దేశాలే తన వైపు తిరిగి చూస్తున్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ అందించాలని, ఆదిలాబాద్ పార్లమెంట్ సీటుని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఈ బహిరంగ సభలో మణిపూర్ మంత్రి సుసింద్రీ, జాతీయ ఓబీసీ నాయకులు,రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాయల్ శంకర్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి, పదాధికారులు, యాత్ర ప్రముఖులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.