Bank Robbery : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని రవీంద్రనగర్ ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చెందారు. శుక్రవారం ఉదయం బ్యాంక్ ఉద్యోగులు ప్రతిరోజూ లాగే తమ విధులకు హాజరయ్యారు. బ్యాంక్ గేట్లు తెరచి లోపలికి వెళ్లగానే గోడకు కన్నం ఉండడం, వస్తువులు చిందర వందరగా ఉండడం గమనించారు. దీంతో బ్యాంక్ ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి ప్రయత్నించిన తీరు, అక్కడ పరిస్థితులను ఆరా తీశారు. గోడకు కన్నం వేసి నేరుగా బ్యాంక్ లోకి చొరబడ్డ నిందితులు లాకర్ ను ఓపెన్ చేసేందుకు గ్యాస్ కట్టర్ ను ఉపయోగించారని పోలీసులు తెలిపారు. అయినా లాకర్ ఓపెన్ కాకపోవడంతో బ్యాంక్ లో ఉన్న సీసీ కేమెరాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఘటనాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.  


అప్పులిస్తున్నట్లు బిల్డప్, కానీ 


అప్పులు ఇచ్చి ఆదుకుంటున్నట్లు ఫోజులు ఇస్తారు. మీ మీద నమ్మకం కల్గితే కోట్లు అయినా ఇస్తామని చెబుతారు. అందుకోసం ఆస్తి పత్రాలు, ఫ్రాంసరీ నోట్లు, బాండ్ పేపర్లు కూడా రాయించుకుంటారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. డబ్బు ఇచ్చేటప్పుడు మోసాలకు పాల్పడుతుంటారు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకునే వారికి బారీ రేటున వడ్డీ, అలాగే నోట్ల కట్టల కింద థర్మాకోల్ పెట్టి డబ్బులు ఎక్కువగా ఉన్నట్లు చెబుతారు. పొరపాటున ఎవరైనా అక్కడ డబ్బు చూసుకోకుండా ఇంటికి వెళ్లారంటే ఇక వాళ్ల పని అంతే. అయితే ఎట్టకేలకు ఇలా మోసాలకు పాల్పడే ముఠా పోలీసులకు చిక్కింది. 


అసలేం జరిగిందంటే..?


మన్సూరాబాద్, సాయి సప్తగిరి కాలనీకి చెందిన 46 ఏళ్ల శంకరమ్మ వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకొని అప్పులు ఇస్తుంది. డబ్బులు సరిగ్గా చెల్లిస్తే, అధిక మొత్తం కూడా అప్పులు ఇస్తానంటూ నమ్మిస్తుంది. అయితే మెదక్ కు చెందిన 30 ఏళ్ల కండెల శ్రీనివాస్ ఆమెకు సహకరిస్తూ.. అప్పులకు మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా... ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన నీలేష్ కృష్ణారావు ప్రైవేటు ఉద్యోగి. ఇతడికి ఫైనాన్స్ వ్యాపారం చేసే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారే పుణెలో ఉండే వైభవ్, ఉత్తమ్ చందన్. వీరిద్దరూ కలిసి వ్యాపారం నిమిత్తం డబ్బుల కోసం కృష్ణారావును సంప్రదించారు. మన్సూరాబాద్, ఎరుకల నాంచారమ్మ కాలనీలో నివాసం ఉండే కొందరు రుణాలు ఇస్తుంటారని స్థానికుల ద్వారా తెలుసుకున్న కృష్ణారావు విషయనాన్ని తన స్నేహితులకు చెప్పాడు. కండెల శ్రీనివాస్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డబ్బులు ఇప్పిస్తాడని తెలుసుకున్న నీలేష్ కృష్ణారావు.. తనకు డబ్బులు కావాలని అతడిని సంప్రదించాడు. అప్పు విషయమై మాట్లాడేందుకు మన్సూరాబాద్ కు రావాలని కండెల శ్రీనివాస్ సూచించడంతో ముగ్గురు కలిసి మంగళవారం అక్కడికి చేరుకున్నారు. నాంచారన్న కాలనీలో నివాసం ఉండే ఓ ఇంట్లో వీళ్లంతా సమావేశం అయ్యారు. రెండు నుంచి మూడు కోట్ల వరకు అప్పు ఇస్తామని శ్రీనివాస్ తెలిపారు. అయితే ముందుగా 20 లక్షలు ఇస్తామని.. రెండు నెలల తర్వాత అసలు 20 లక్షలు వడ్డీతో కలుపుకొని 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. నమ్మకం కుదిరితే కోటి రూపాయల వరకు అప్పుగా ఇస్తామని షరతులు విధించారు. సంప్రదింపుల అనంతరం నీలేష్ కృష్ణారావు, వైభవ్, ఉత్తమ్ చందన్ ను కండెల శ్రీనివాస్ తన వెంట సాయి సప్తగిరి కాలనీలో నివాసం ఉండే వడ్డీ వ్యాపారి శంకరమ్మ ఇంటికి తీసుకెళ్లాడు.  


మూడు బాక్కుల్లో పెట్టి 500 రూపాయల నోట్ల కట్టలను చూపించారు. డబ్బులను నీలేష్ కృష్ణారావు, వైభవ్, ఉత్తమ్ చంద్ పరీక్షించారు. రూ.500 నోట్ల కట్టల్లో పైనా, కింద నోట్లు పెట్టి మధ్యతో థర్మాకోల్ పెట్టినట్లు గ్రహించారు. అనుమానం రావడంతో ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. డబ్బులు ఉన్న మూడు బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. అందులో థర్మాకోల్ తోపాటు 23 లక్షల 45 వేల రూపాయల డబ్బును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.