Kumuram Bheem Asifabad District: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఎద్దు అంతులేని వేదన అనుభవించింది. జిల్లాలోని కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ గ్రామానికి చెందిన ఎలుములే జీత్రు అనే రైతుకు సంబంధించిన ఎద్దు సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి విపరీతంగా గాయాలపాలు అయింది. మేత కోసం వెళ్లిన ఎద్దు గడ్డి తింటూ.. ఓ బాంబును కొరికింది. దీంతో ఆ ఎద్దు దవడ పేలిపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


గురువారం రైతు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలో మొగడ్ ధగడ్ గ్రామ సమీపంలో ఎద్దును మేత కోసం అడవిలోకి తోలారు. ఆ ఎద్దు గడ్డి మేస్తూ బాంబును నోటితో కొరికింది. సాధారణంగా ఆ అడవిలో అడవి పందులను వేటాడడానికి గడ్డిలో పెట్టిన నాటు బాంబును పెడుతుంటారు. అలా మేతకు వెళ్లిన ఎద్దు గడ్డి తింటూ నాటు బాంబును కోరకడంతో.. ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. బాంబు పేలడంతో ఎద్దు తల కింది దవడ భాగం చెల్లాచెదురైందని రైతు తెలిపారు. 


దీంతో ఉలిక్కిపడి దద్దరిల్లిన ఎద్దు పరుగులు తీస్తూ ఇంటికి రావడంతో ఎద్దును చూసిన రైతు ఎలుములే జిత్రు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకుని గ్రామ పెద్దలకు తెలిపాడు. ప్రస్తుతం పంట పొలాల్లో ఇప్పుడు దున్నే పని ఉందని, వచ్చే జూన్ నెలలో పొలంలో విత్తనాలు వేసేందుకు భూమిని చదును చేయాలని చూస్తున్న తరుణంలో తన ఎద్దు ఇలా నాటు బాంబు పేలుళ్లతో గాయపడిందని రైతు ఆవేదన చెందారు.