Rs 4016 Asara Pension For Disabled Persons: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ఆసరా పింఛను రూ.4016కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు జులై నెల పింఛను నుంచే సవరించిన పింఛను రూ.4016 అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు లబ్ది చేకూరనుంది. జూన్ 9న మంచిర్యాలలో జరిగిన సభలో వికలాంగుల ఫించను రూ. 3,016 రూపాయల నుంచి రూ. 4,106 లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ పెరిగిన పింఛన్లు జులై నెల నుంచి అమలులోకి రానున్నట్లు సర్కార్ తాజాగా జీవో ఇచ్చింది.
దివ్యాంగులకు పింఛను పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 11 వేల 656 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుంది. పింఛను పెంపు వల్ల నెలకు 205 కోట్ల 48 లక్షల రూపాయల మొత్తం ఆసరా కింద రాష్ట్రంలోని దివ్యాంగులకు అందనున్నది. తెలంగాణ రాకముందు కేవలం 3.57 లక్షల మంది వికలాంగులకు నెలకు 500 చొప్పున మాత్రమే కేవలం 17 కోట్లు మాత్రమే అందేవన్నారు.
తెలంగాణ ఆసరా పింఛను పథకం, వృద్ధుల, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలకు ఆసరాగా నిలవాలని పింఛను కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృధ్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు, హెచ్.ఐ.వి. ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధి పొందుతున్నారు. దేశంలోనే బీడి కార్మికులకు ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రాష్ట్రంలో ప్రస్తుతం ఆసరా పించన్లు వీరికే..
1. వృధ్ధులు రూ.2016
2. వితంతువులు రూ.2016
3. వికలాంగులు రూ.3016
4. చేనేత కార్మికులు రూ.2016
5. కల్లు గీత కార్మికులు రూ.2016
6. బీడి కార్మికులు రూ.2016
7. ఒంటరి మహిళలు రూ.2016
8. ఎచ్.ఐ,వి. బాధితులు రూ.2016
9. బోదకాలు రూ.2016
10. కళాకారులు రూ.2016
పింఛను పథకానికి అర్హతలు ఇలా ఉన్నాయి..
- వృద్ధులు: ఏప్రిల్ 1, 2019 నుంచి 57 సంవత్సరాలు (మార్చి 31, 2019 వరకైతే 65 సంవత్సరాలు) లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వృద్ధులు ఆసరా పింఛను పథకానికి అర్హులు అని సర్కార్ ప్రకటించింది. జనన ధ్రువీకరణ పత్రము, ఆధార్ కార్డు, లేదా వయసుని తెలిపే ఏదైనా ఇతర డాక్యుమెంట్స్ ధరఖాస్తుకు అవసరమవుతాయి.
- చేనేత కార్మికులు: 50 సంవత్సరాలు అంత కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వారు అర్హులు.
- వితంతువులు: 18 సంవత్సరాలు నిండినవారై, భర్త డెత్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులు. వెరిఫికేషన్ సమయంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి. మరణ ధ్రువీకరణ పత్రం లేకపొతే జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మూడు నెలల్లో ధ్రువీకరణ పత్రం పొందాలి. లబ్ధిదారుని పునర్వివాహం విషయంలో విలేజీ సెక్రెటరీలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం సర్టిఫై చేయాలి.
- కల్లు గీత కార్మికులు: 50 సంవత్సరాలు నిండినవారై ఉండాలి. లబ్ధిదారుడు కల్లు గీత కార్మికుల సహాయక సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి.
- వికలాంగులు: వీరికి వయస్సుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం వైకల్యం కలిగి ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారైతే 51 శాతం వైకల్యం కలిగి ఉండాలి. వికలాంగులకు అందించే SADAREM సర్టిఫికెట్ లో 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు అని ప్రభుత్వం తెలిపింది.
హెచ్.ఐ.వి - ఎయిడ్స్ : యాంటీ రిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్నవారు అర్హులు. వ్యాధిని నిర్ధారిస్తూ ఏదైనా ఆసుపత్రి యాజమాన్యం వారు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిర్ధారణ సమయంలో అవసరమవుతాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial