Pawan Kalyan on Volunteers : ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల విధులు, వారి విషయంలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. మరో సారి పవన్ కల్యాణ్ వాలంటీర్ల తీరుపై ఆరోపణలు చేశారు. ఈ సారి నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో వలంటీర్లు పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఏపీ అధికార పార్టీ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. వాలంటీర్లను ఓటర్ వెరీఫికేషన్ లో భాగం చేశారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సీఈవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
కర్నూలులో బీఎల్‌వో సస్పెన్షన్
పవన్ కల్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్న పేపర్ కటింగ్‌లో ఉన్న బీఎల్‌వోను ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. కర్నూలులో ఎక్కువగా వాలంటీర్ల జోక్యం ఉన్నట్లుగా ఫిర్యాదులు రావడంతో.. ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.సుజనా సిబ్బందిని ఆదేశించారు. కర్నూలు జిల్లాలో ఇంటింటికి ఓటర్ల సర్వే కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన కర్నూల్ రెవెన్యూ డివిజన్ లోని వెల్దుర్తి మండల కేంద్రంలో బీఎల్ఓ పై సస్పెన్షన్ వేటు వేశారు. వాలంటర్‌తో కలిసి బీఎల్ఓ ఇంటింటా సర్వేలో పాల్గొన్నారు. దీంతో కలెక్టర్ డాక్టర్ సుజనా సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయని సూచించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వాలంటరీతో కలిసి సర్వే చేస్తే సస్పెన్షన్స్ ఉంటాయని హెచ్చరించారు.
ఇప్పటికే టీడీపీ ఫిర్యాదులతో కలెక్టర్లకు ఈసీ నోటీసలు
బీఎల్‌ఓలతో పాటు వెళుతున్న వాలెంటీర్‌ల ఫోటోలు తీసి ఎన్నికల కమిషన్ సీఈఓకు టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్.. వాలెంటీర్‌లు వెళ్లిన జిల్లాల నుంచి వెంటనే నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. వాలెంటీర్‌లను ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో జోక్యం చేసుకోనివ్వకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమాలను బహిర్గతం కాకుండా బీఎల్‌ఓలకు చెప్పేందుకు వాలెంటీర్‌లను కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. బీఎల్‌ఓలతో వాలెంటీర్‌లు వస్తే వెంటనే ఫోటోలు తీసి పంపాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. వాలెంటీర్‌ను వెంటపెట్టుకొని వెళ్లిన ఒక బీఎల్‌ఓను కర్నూలు అధికారులు సస్పెండ్ చేశారు. తెలుగుదేశం ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని మరికొంతమంది బీఎల్‌ఓలు, వాలెంటీర్‌లపై చర్యలు తీసుకునేందుకు ఈసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా వాలెంటీర్‌ల జోక్యంపై ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేశారు.