Asaduddin Owaisi: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో చంద్రబాబు నాయుడు హ్యాపీగా ఉన్నారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ పాలనా వ్యవహారాలు, పార్టీ విస్తరణ బలోపేతం పైన చర్చించారు. ఆ సమయంలోనే చంద్రబాబు అరెస్ట్ గురించి కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. దీని పైన అసద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 


ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు హ్యాపీగా జైల్లో ఉన్నారన్నారు. ఆయన ఎందుకు జైలుకెళ్లారో అందరికీ తెలుసన్నారు. ఏపీలో రెండే పార్టీలు ఉన్నాయన్నారు. ఒకటి సైకిల్, రెండు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో సీఎం జగన్ పాలన ఒకింత బాగుందని ఒవైసీ కితాబిచ్చారు. చంద్రబాబును నమ్మలేమని.. ప్రజలు కూడా నమ్మొద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంఐఎం పని చేయాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 
 
బీఆర్‌ఎస్‌కు మద్దతు.. వేధిస్తే ఊరుకోం
బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌(BRS)కు సపోర్ట్ చెయ్యాలని పార్టీ సభ్యులకు కార్యకర్తలకు, ఓటర్లకు స్పష్టం చేశారు. తెలంగాణలో 9 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పరిపాలన నడుస్తుందని, ఎలాంటి మతకలహాలకు చోటు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ ప్రశంసించారు. 
అలాగే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని అసదుద్దీన్ మండిపడ్డారు. వారిని గుర్తుపెట్టుకుంటామని అన్నారు. తమతో మంచిగా ఉంటే చేయి ఇస్తామని.. స్నేహం పేరుతో మోసం చేస్తే ఊరుకునేది లేదని అసదుద్దీన్ హెచ్చరించారు. 


రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన ఓవైసీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. గత ఆదివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారని ఆరోపించారు. 


‘మీ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసురుతున్నాను. మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో నాతో తలపడండి’ అని అన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు చాలా విషయాలు చెబుతారని, కానీ ఆ పార్టీ హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదును కూల్చివేశారని ఓవైసీ ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల తర్వాత ఒవైసీ ఈ సవాలు విసిరారు. 


బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి మతపరంగా దూషించిన ఘటనపై అసద్ మాట్లాడుతూ.. పార్లమెంటులో ముస్లింల సామూహిత హత్యలు జరిగే రోజు ఎంతో దూరం లేదన్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. దీనిపై దేశ ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడరని విమర్శించారు. పార్లమెంటులో ముస్లిం ఎంపీ గురించి మాట్లాడిన బీజేపీ ఎంపీ తనతో వాదించలేరని, అందుకే కూర్చోమని చెప్పానని ఒవైసీ పేర్కొన్నారు.