Khammam BRS Meeting : ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్ నుంచి జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత సొంతగడ్డ తెలంగాణపై నిర్వహిస్తున్న తొలి సభ ఇదే. . పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాల కార్యాచరణను ప్రకటించనున్నారు. బహిరంగసభకు సీఎం కేసీఆర్, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. ఖమ్మంలో నిర్వహించే బీఆర్‌ఎస్ బహిరంగ సభ దేశంలో బీజేపీయేతర పార్టీల బలానికి, బీఆర్‌ఎస్ నిర్మాణశక్తిని చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ వెంట వస్తున్న ఎస్పీ, ఆప్, సీపీఐ, సీపీఎం సహా అనేక పార్టీలను ఏకం చేయగల సత్తా సీఎం కేసీఆర్‌కు ఉన్నదని బీఆర్ఎస్ వర్గాలు ఈ వేదికగా సందేశం ఇవ్వనున్నారు.
‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలు చేస్తోంది. ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బహిరంగసభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్‌తోపాటు మూడు రాష్ర్టాల సీఎంలు, యూపీ మాజీ సీఎం, ఇతర ముఖ్య నేతలు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమిస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 18న సీఎం కేసీఆర్ ముందుగా ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను, తరువాత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం మెడికల్ కళాశాలకు శంకుస్థానన చేస్తారు. అనంతరం బీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు. కలెక్టరేట్ ప్రారంభం, బహిరంగ సభ బందోబస్తును వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షిస్తారు. రూట్ బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్ ప్రాంతాలతోపాటు లా అండ్ ఆర్డర్ వంటి వాటిని మల్టీజోన్-2 ఐజీపీ షానవాజ్ ఖాసీం పర్యవేక్షిస్తారు. మొత్తం కార్యక్రమ ఇన్‌చార్జులుగా మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ వ్యవహరించనున్నారు. ఐజీపీ షానవాజ్ ఖాసీం నిర్వహించే కార్యక్రమాలకు గద్వాల జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్‌ను సహాయకుడిగా నియమించారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహించే విధులకు రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కే రమేశ్‌నాయుడు సహాయకుడిగా ఉంటారు. అవసరమైన బందోబస్తు బృందాలను అడిషనల్ డీజీపీ విజయ్‌కుమార్ ఏర్పాటు చేస్తారు. వీరంతా సోమవారం నుంచే ఖమ్మంలో విధులు నిర్వర్తించాలని డీజీపీ ఆదేశించారు.
కేసీఆర్ పర్యటన, బహిరంగ సభ నిమిత్తం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్‌లు ఏర్పాటు చేశారు. మీటింగ్ వచ్చే ప్రజలు పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలిపి మీటింగ్ స్థలానికి చేరుకోవచ్చు. భారీ వాహనాలు వెళ్లే హైవే లో లారీలు, హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే డీసీఎంలు బోనకల్ చిల్లకల్లు వైపు మళ్లించనున్నారు. ఖమ్మం టౌన్‌లో భారీ వాహనాలను అనుమతించడం లేదు. ఖమ్మం వెళ్లే వాహనాలను తిమ్మరావుపేట, ముచ్చర్ల ఎక్స్ రోడ్డు-ఎన్టీఆర్ సర్కిల్ వైపు మళ్లించనున్నారు. భారీ వాహనాలను ఖమ్మం రోడ్డుకు అనుమతించడం లేదు. కావున ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలందరూ వేరే మార్గాల ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.