Breaking News Live Updates: ఇది కేసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్ర: రేవంత్ రెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 28 Oct 2021 10:22 PM
ఇది కేసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్ర: రేవంత్ రెడ్డి

కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర  జరుగుతోందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, ఏపీ మంత్రి పేర్ని నాని “సమైక్య రాష్ట్ర” ప్రతిపాదన  తేవడం, కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర అని ఆరోపించారు. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…! అని రేవంత్ రెడ్డి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.





ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీ కాంత్..!

సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆరోగ్యమా, లేక ఇతర కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.  

నవంబరు 4న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

 నవంబరు 4న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నవంబ‌రు 3న వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపింది. తిరుమల శ్రీ‌వారి ఆలయంలో నవంబరు 4న దీపావళి ఆస్థానం నిర్వహించ‌నున్నారు. ఈ సందర్భంగా నవంబరు 4న వీఐపీ బ్రేక్ ద‌ర్శనాలను టీటీడీ ర‌ద్దు చేసింది. ఈ కారణంగా నవంబరు 3న‌ వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపింది. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో విడుదల చేసింది. 

కడప స్టీల్ ప్లాంట్ కు పర్యావరణ అనుమతులు

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు జారీచేసింది. అనుమతులు రావడంతో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నుంచి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3591 ఎకరాల్లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు. ఏడాదికి మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. దీని కోసం రూ. 16,986 కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉంటుందని అంచనా. 

గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సీఎం జగన్ 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దంపతులు గురువారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్‌ 1న జరిగే వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం జగన్‌ గవర్నర్‌ను కోరారు. 

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్

ముంబయి డ్రగ్స్ కేసులో అరెస్టైన్ ఆర్యన్ ఖాన్ బెయిల్ మంజారు అయింది. ఆర్యన్ తో పాటు మరో ఇద్దరికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అరెస్టైన 21 రోజుల తర్వాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చింది. 

టీడీపీ గుర్తుంపు రద్దు చేయాలని సీఈసీకి వైసీపీ ఫిర్యాదు

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం గురువారం సీఈసీని కలిశారు. 

ముగిసిన ఏపీ కేబినేట్ భేటీ... పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ చట్టసవరణ, 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు, కొత్తగా జైన్‌ కార్పొరేషన్‌, సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాజీ మిస్ తెలంగాణ

హైదరాబాద్‌లో మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఇంట్లోనే ఉరి వేసుకుంటూ ఆమె సామాజిక మాధ్యమాల్లో లైవ్ వీడియో స్ట్రీమ్ చేశారు. దీన్ని గమనించిన యువతి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. తక్షణం యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు.

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డాక్టర్లు సరిగ్గా పట్టించుకోలేదని, దీంతో నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సీజేరియన్ చేస్తుండగా.. భాగ్యలక్ష్మి అనే మహిళ కోమాలోకి వెళ్లింది. వైద్యులు కుటుంబ సభ్యులకు తల్లి, బిడ్డ పరిస్థితి సీరియస్‎గా ఉందని చెప్పడంతో వెంటనే మహిళను భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి హైదరాబాద్‎లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తల్లి, బిడ్డ పరిస్థితి విషమించింది. పది రోజులుగా కోమాలో ఉండగా.. గురువారం తల్లి, బిడ్డ చనిపోయారు. దీంతో మహిళ బంధువులు కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ భాగ్యలక్ష్మి శవంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు.

ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో చట్ట సవరణకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు.

చిట్యాలలో 22 కిలోల గంజాయి పట్టివేత

నల్గొండ జిల్లా చిట్యాలలో భారీగా గంజాయి పట్టుబడింది. 65వ జాతీయ రహదారిపై పోలీసులు బస్సులలో తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర సీలేరు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు చేస్తుండగా.. 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

దళిత బంధుపై హైకోర్టులో విచారణ

దళిత బంధుపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆ పథకాన్ని అమలు చేయాలని దాఖలైన నాలుగు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఆ అంశంపై ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఆదేశాలిచ్చిందని, మరోసారి తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది.

ప్రేమోన్మాది ఘాతుకం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమోన్మాది ఘాతుకం చేశాడు. వట్టి నాగులపల్లిలో ప్రేమను నిరాకరించిందని ప్రేమ సింగ్ అనే యువకుడు యువతి ఇంటిలో చొరబడి ఆమెను బంధించాడు. గొంతు, చేతి మణికట్టు వద్ద కోశాడు. అమ్మాయి అరుపులతో బంధువులు, స్థానికులు యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో స్థానికులు బాధితురాలిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.

Background

ఏపీ సచివాలయంలో గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చిస్తారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తితిదేతో పాటు, వీటికి కూడా వర్తించేలా దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.