Breaking News Live Updates: సీట్ కింద గంజాయి.. సీక్రెట్ గా రవాణా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 25న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 25 Oct 2021 08:00 PM
సీట్ కింద గంజాయి.. సీక్రెట్ గా రవాణా

తూర్పుగోదావరి జిల్లా  చింతూరులో గంజాయి పట్టుబడింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహన సీట్ లో అమర్చిన గంజాయి రవాణా చేస్తున్నారు. గంజాయి రవాణాకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి గంజాయి ముఠాలు. ద్విచక్ర వాహనం సీట్ లో అమర్చిన 34 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

హుజూరాబాద్ లో తొలిసారిగా 72 గంటల నిబంధన 

హుజూరాబాద్ ఉపఎన్నికలో 72 గంటల నిబంధనను ఎలక్షన్ కమీషన్ తొలసారిగా అమలుచేస్తుంది.  ఈ ఎన్నికల్లో స్థానికేతరులైన నాయకులూ, కార్యకర్తలు 72 గంటల ముందే హుజూరాబాద్ ని వదిలి వెళ్లిపోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. స్థానికేతర నేతలకు ఈ నిబంధనపై అంతగా అవగాహన లేకపోవడంతో అయోమయంలో ఉన్నారు. ఎన్నికకు ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందు, డబ్బు పంపిణీ అడ్డుకోడానికి తీసుకొనే చర్యల్లో భాగంగానే ఈ నూతన విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. 

ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ.. 7 తీర్మానాలకు ఆమోదం

తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ వేడుకలు(ప్లీనరీ) ముగిసింది. హైదరాబాద్ హెటెక్స్ లో జరిగిన ఈ సమావేశంలో ఏడు తీర్మానాలు ఆమోదం తెలిపారు. సుమారు ఎనిమిది గంటల పాటు ప్లీనరీ జరిగింది. కేసీఆర్ ను టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

కేసీఆర్ రానప్పుడు ఈ పథకాలు ఎక్కడివి.. చెంప పగిలేలా బదులివ్వండి.. మంత్రి జగదీష్ రెడ్డి

గుడారాలు, గుడిసెలు కింద సభ నుండి హైటెక్స్ లో ఘనంగా జరుపుకునే స్థాయికి టీఆర్‌ఎస్ ఎదిగిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పొరుగు రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించే స్థాయికి నల్గొండ ఎదిగింది. పథకాలకు సీఎం కేసీఆర్ ఇంట్లో డబ్బు పెడుతున్నాడా అంటే.. చెంప పగిలేలా సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ రానప్పుడు ఈ పథకాలు ఎక్కడివి.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఇలాంటి పథకాలు పెట్టలేకపోయారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

చిత్తూరు బాలుడి హత్య కేసులో సంచలనం... బాలుడిపై లైంగిక దాడి

చిత్తూరు జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడిని బొప్పాయి తోటలోకి ఎత్తుకెళ్లి మరో మైనర్ లైంగిక దాడిచేసినట్లు పోలీసులు విచారణ తెలిసింది.  నిందితుడు హోమోసెక్సువల్ అని పోలీసులు భావిస్తున్నారు. బయటపెడతాడనే భయంతోనే బాలుడ్ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హైఅలెర్ట్

ములుగు జిల్లా తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. వాజేడు మండలం టేకుల గూడెం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని తనిఖీలు చేపట్టారు. అన్ని వాహనాలను నిలిపోయివేసి ప్రతి ఒక్కరినీ చెక్ చేస్తున్నారు. అనుమానితుల వివరాలు సేకరించి స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మావోయిస్టులు ప్రతీకార చర్య ఉంటుందని బంద్ ప్రకటించడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 

టీఆర్ఎస్ పాలనపై కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపిస్తోంది.. కేటీఆర్

ఈరోజు తెలంగాణ ఆలోచించేది రేపు దేశం మొత్తం ఆలోచిస్తుందని టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే మనం వేగంగా ఉన్నాం.. ప్రతీ పల్లె తెలంగాణలో నేడు ఆదర్శ పల్లె గా మారింది. టీఆర్ఎస్ పాలనపై కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపిస్తోంది. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణా దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. గతంలో మీకు పరిపాలన చేతాకాదు అని కామెంట్ చేసిన వాళ్లు ఇప్పుడు తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

సమాచార హక్కు చట్టంపై సీఎస్ ఆదేశాలు రద్దుపై హైకోర్టులో పిల్

సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సీఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా తెలుసుకునే హక్కును ప్రభుత్వం అడ్డుకునే విధంగా ఆదేశాలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని పిల్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేశారు. డిపార్ట్మెంట్ హెడ్ ల అనుమతి తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని సీఎస్ జీవో జారీ చేశారు. ఈ జీవోపై హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది.  

వలస కార్మికులను ఆదుకున్న ఘనత కేసీఆర్ దే : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన కులాలు ఆర్థికంగా నిలబడేలా  చేశారు. దేశంలో అత్యధిక జీతాలు తీసుకునే ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమన్యాయం చేశామన్నారు. అన్ని కులాలు, మతాలను ఆదుకున్న ఘనత కేసీఆర్ సొంతమన్న శ్రీనివాస్ గౌడ్... లబ్ధిపొందిన వారు కేసీఆర్ చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలన్నారు. వలస కార్మికులను ఆదుకున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 

ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది : మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం వైసీపీ చేస్తోందని టీడీపీ‌ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. తిరుపతిలో చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడుకు ఫిర్యాదు చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ.. విజన్ కలిగిన  నేత ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడే అని సుగుణమ్మ అన్నారు. ఈ నెల 22 వ తేదీన తిరుపతి ఎమ్మెల్యే భుమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బొమ్మతో నడి రోడ్డుపై శవయాత్ర చేయడం దారుణమన్నారు. శవయాత్ర చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చెయ్యాలని ఎస్పీకి ఫిర్యాదు చేసామని ఆమె తెలిపారు. ఇందుకు ఎస్పీ సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సుగుణమ్మ అన్నారు.

డిసెంబరు కల్లా దళిత బంధు డబ్బులు..

‘‘భారత ఎన్నికల సంఘం పరిధిని దాటుతున్నారు. ఈసీ తమ బాధ్యతను నిలబెట్టుకోవాలి. ఉప ఎన్నిక జరిగిన చోట నేను సభ పెట్టుకోవద్దని హైకోర్టులకు వెళ్తున్నారు. ఇదేం రాజకీయం? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చు. హుజూరాబాద్ ప్రజలకు నాదో విన్నపం. ఇప్పటికే అక్కడ పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు ప్రారంభం అయింది. ఎన్నికల సంఘం నిలువరించింది. కానీ, నవంబరు 4కు మించి ఎన్నికల సంఘం దాన్ని నిలువరించలేదు. బాజాప్తా నవంబరు 4 తర్వాత అందరికీ డబ్బులు వస్తాయి. మార్చి నాటికి దళిత బంధును విస్తరిస్తాం. నవంబరు, డిసెంబరులో యుద్ధ ప్రాతిపదికన హుజూరాబాద్‌లో దళిత బంధు పూర్తి చేస్తాం. అనంతరం 118 నియోజకవర్గాల నుంచి 118 బస్సుల్లో ప్రజలు వచ్చి హుజూరాబాద్‌లో దళిత బంధు ఎలా అమలవుతుందో చూస్తారు’’ అని కేసీఆర్ చెప్పారు.

అన్ని వర్గాల్లోని పేదలకు దళితబంధు లాంటి సాయం.. కేసీఆర్ హామీ

‘‘స్పష్టమైన, సంపూర్ణమైన లక్ష్యంతో దళిత బంధును ప్రవేశపెట్టాం. మన రాష్ట్రంలో ఉన్న బడుగు, బలహీన వర్గాలు అందరినీ బాగు చేయడమే మన లక్ష్యం. కేవలం దళితుల వ్యవహారంలోనే కాక.. కమ్మ, బ్రాహ్మణ, రెడ్డి, వెలమ వంటి అగ్రవర్ణాల్లోనూ పేదలకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశం మనకు ఉంది. మీ బిడ్డగా నేను ఈ రోజు హామీ ఇస్తున్నా. కాంగ్రెస్, బీజేపీ నేతలకు నేను ఒకటే సవాలు విసురుతున్నా. ఇన్నేళ్లలో రాష్ట్రాన్ని మీరే పాలించారు. కేంద్రం నుంచి మీరే ఉన్నారు. అప్పుడు బలహీన వర్గాలకు సాయం చేయాలనే ఆలోచన రాలేదా? దళిత బంధు లాంటి కార్యక్రమాలను అన్ని వర్గాల్లోని పేదలకు ఇచ్చేలా ప్రణాళిక చేయనున్నాం.’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

23 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాం

‘‘టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఈ మిగిలిన రెండు సంత్సరాలు.. వచ్చే టర్మ్‌లో ఐదేళ్లు కలిపితే మొత్తం ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టబోయే సొమ్ము.. 23 లక్షల కోట్ల రూపాయలు. 2028లో మన రాష్ట్ర బడ్జెట్ 4.28 లక్షల కోట్ల రూపాయలకు చేరనుంది. 2 లక్షల 37 వేల కోట్లుగా ఉన్న మన తలసరి ఆదాయం.. 2028 నాటికి 7 లక్షల 76 వేల రూపాయల తలసరి ఆదాయంగా చేరనుంది. ఇదీ.. కాబోయే తెలంగాణ. ఈ లెక్కలన్నీ మనం చెప్పేవి కావు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు చెప్పిన లెక్కలు, అంచనాలు ఇవన్నీ. స్పష్టమైన, సంపూర్ణమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.’’

హేళన చేసిన రాష్ట్రంలోనే 24 గంటల కరెంటు లేదు

‘‘జై తెలంగాణ అని తొలిసారి అన్ననాడు ఎంత మంది హేళన చేశారో మీకు తెలుసు. ఇప్పుడు కూడా ఏ విప్లవాత్మక పథకం ప్రవేశపెట్టినా అంతే మాట్లాడుతున్నారు. దళిత బంధ ఒక ప్రతిష్ఠాత్మక పథకం. రైతు బంధు పెట్టినప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడారు. దానివల్ల రాష్ట్రంలో వ్యవసాయం ఎలా స్థిరీకరణ జరిగిందో మీకు తెలుసు. దేశానికే తెలంగాణ అన్నపూర్ణ అయింది. తెలంగాణ వస్తే కరెంటు కోతలు ఉంటాయని ఎవరైతే అన్నారో.. వారి రాష్ట్రం ఏపీలో ఇప్పుడు 24 గంటల కరెంటు లేదు. ఇవన్నీ వాస్తవాలు. రెవెన్యూ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేశాం. ఆనాడు ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను తీసేసిన తరహాలోనే.. వీఆర్వోలను రద్దు చేసి.. ధరణి వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు అద్భుతమైన రీతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.’’

ముఖంపై చిరునవ్వే లక్ష్యంగా ముందుకు..

‘‘తెలంగాణ ప్రజల మోముపై చిరునవ్వే మన అభిమతం. అందర్నీ కడుపులో పెట్టుకొని సాగాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నాం. వ్యతిరేక శక్తులు ఎప్పుడూ ఉంటాయి. పోరాట సమయం నుంచి ఇప్పటి వరకూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ అడ్డు తగిలారు. నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త సచివాలయం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, యాదాద్రి ప్రాజెక్టు లాంటి ప్రతి విషయంలో విపక్షాలు అడ్డుతగిలారు. కోర్టుల్లో పిటిషన్లు వేసి ఎన్నో అడ్డు పుల్లలు వేశారు. వివిధ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు సహా అన్నింటిని పూర్తి చేస్తున్నాం. ఈ మధ్యే నేను ఢిల్లీ వెళ్లినప్పుడు.. ఇలా అన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నారని ఇతర రాష్ట్రాల సీఎంలు నన్ను ప్రశ్నించారు.’’ అని కేసీఆర్ అన్నారు.

ఏపీలోనూ టీఆర్ఎస్ స్థాపించాలని కోరుతున్నారు: కేసీఆర్

‘‘తెలంగాణ వస్తే అభివృద్ధి కుంటు పడుతుందని, కరెంటు కొరత ఏర్పడి చీకట్లు ఏర్పడతాయని, వ్యవసాయం దిగజారుతుందని, భూములన్నీ బీడు వారతాయని ఎంతో మంది ఎద్దేవా చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. దేశంలోనే ఈ ఏడేళ్లలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించింది. తలసరి విద్యుత్ వినియోగం మాత్రమే కాకుండా, తలసరి ఆదాయం విషయంలో కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాం. ఆర్థికంగా దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో మనం ఒకటిగా ఉన్నాం. కరవు ప్రాంతాలైన సిద్దిపేట, గజ్వేల్, పాలమూరు వంటి ప్రాంతాల్లో ఇప్పుడు పూర్తిగా కరవు కనుమరుగైంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఈ ప్రాంతాల్లో పని చేసే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల వారు తమను తెలంగాణలో కలపాలని నన్ను కోరారు. కర్ణాటకలో కూడా ఓ మంత్రి కూడా వచ్చి రాయచూరును తెలంగాణలో కలపాలని కోరారు. ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఏపీలో కూడా టీఆర్ఎస్‌ను స్థాపించాలని కోరుతున్నారు.’’ అని కేసీఆర్ అన్నారు.

సమైఖ్య పాలకులు ఎంతో ఇబ్బంది పెట్టారు

‘‘ఎన్నో అపనమ్మకాల మధ్య పార్టీ ఏర్పడింది. అహింసాయుతంగా లక్ష్యాన్ని చేరుకొనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. స్పష్టమైన లక్ష్యంతో ముందుకు కదిలాం. సమైఖ్య పాలకులు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. ఉద్యమకారులు అధికారం చేపడితే.. పాలనలో విజయం సాధించిన దాఖలాలు పెద్దగా లేవు. కానీ, తెలంగాణలో అందుకు భిన్నంగా ఉంది. గతంలో ఎంతో మంది కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ విషయాన్ని నా వద్ద ప్రస్తావించారు.’’ అని కేసీఆర్ ప్రసంగించారు.

కేసీఆర్ అధ్యక్ష ఉపన్యాసం ప్రారంభం

అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికపై అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 2001లో కొద్ది మంది తన మిత్రులతో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. 

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో వరుసగా తొమ్మిదో సారి కేసీఆర్‌ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఆ వెంటనే వేదికపై ఉన్న నేతలంతా కేసీఆర్ వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.

టీఆర్ఎస్ ప్లీనరీ వద్దకు కేసీఆర్.. జెండా ఆవిష్కరణ

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ పాార్టీ ప్లీనరీ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడే చేరుకున్నారు. సభావేదికపైకి చేరుకొని పార్టీ నాయకులందరికీ అభివాదం, నమస్కారం చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండాను వేదికపై ఆవిష్కరించారు. అనంతరం వేదికపైనే ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లికి, అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. 

ఢిల్లీ చేరుకున్న టీడీపీ నేతలు

చంద్రబాబు నాయుడు సహా ఏపీ టీడీపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం వారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన గురించి వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు వారికి సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరికింది.

ఎదురు కాల్పుల్లో మావోల మృతి

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పేరూరు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందినట్లు సమాచారం. ఒక ఎస్ఎల్ఆర్ ఒక ఏకే 47 ఆయుధాలను సంఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఈ మావోల్లో ఓ అగ్రనేత ఉన్నారని భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Background

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత అమరవీరులకు కేసీఆర్‌ నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన, అనంతరం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పార్టీ రాజకీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయి అంశాలపై కొన్ని తీర్మానాలు చేస్తారు. వీటిని ఏడుగురు వేర్వేరు నేతలు ప్రతిపాదిస్తారు. అనంతరం వాటిపై చర్చించి, ఆమోదించుకుంటారు. 


తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీ మరోసారి ప్లీనరీకి సిద్ధమైంది. నేడు ప్లీనరీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. 2018 తర్వాత మూడేళ్లకు ఇది జరుగుతోంది. టీఆర్ఎస్ 13 ఏళ్లపాటు ఉద్యమం నడిపి, ఏడేళ్ల క్రితమే అధికారంలోకి వచ్చింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. దీని కోసం బస్తీ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ప్లీనరీకి ప్రజాప్రతినిధులతో పాటు కొత్త సంస్థాగత కమిటీల ప్రతినిధులనూ ఆహ్వానించారు. 


Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !


ఆహ్వానితులు వీరే..
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జడ్పీల ఛైర్‌పర్సన్లతో పాటు మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు అందరినీ ఆహ్వానించారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఆరున్నర వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళలు గులాబీ రంగు వస్త్రాలు ధరించి రావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. సభ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.


Also Read : బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ చిత్రం.. కేసీఆర్, కవిత ఫోటోలు కూడా.. మీరూ చూడండి


హరీశ్ రావు దూరం
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలంతా ఇప్పుడు ప్లీనరీ మూడ్‌లో ఉన్నారు. కానీ  ఈ ప్లీనరీకి హరీష్ రావుకు ఆహ్వానం లేదు. ఆయన ఒక్కరికి మాత్రమే కాదు  హుజురాబాద్ ఎన్నికల పనులు చూసుకుంటున్న ఎవరికీ ఆహ్వానం లేదు. అందరూ ఎన్నికల పనుల్లోనే బిజీగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హరీష్‌తో పాటు హుజూరాబాద్‌లో ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న వారెవరూ కూడా నియోజకవర్గంలో నుంచి కదలవద్దని చెప్పినట్లుాగ తెలుస్తోంది.  అక్కడ మకాం వేసిన టీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రచారినికే పరిమితం కానున్నారు. 


Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.