Breaking News Live Telugu Updates: తెలంగాణలో మరోసారి పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇప్పటికే రౌండప్ లు, ప్యాసింజర్ సెస్, టోల్ ప్లాజా సెస్ ల పేరుతో ఛార్జీలు పెంచిన ఆర్టీసి.. ఈసారి డీజిల్ సెస్్ పేరుతో వడ్డనకు సిద్ధమైంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులో ప్రయాణికుడి నుంచి రెండు రూపాయలు వసూలు చేయనుంది. మిగతా సర్వీసుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి ఐదు రూపాయల వరకు వసూలు చేయడానికి ప్రణాళికి రెడీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోమువీర్రాజుపై కేసు నమోదైంది. ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన వీర్రాజుపై కేసు నమోదు. 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రేప్ కేసులో మరో అప్‌డేట్ వచ్చింది. బాలికను చిత్రవధ చేసిన ఇన్నోవా కారు వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ది పోలీసులు తేల్చారు. ఏడాదిగా ఆయన కుమారుడు ఈ కారు వాడుతున్నట్టు నిర్దారించారు.
ఎమ్మెల్యేలు ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలో సీఎం జగన్ చెప్పారలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. మేనిఫెస్టో హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా జనాల్లోకి వెళ్లాలని సీఎం జగన్ సూచించినట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో మూడు రోజులు ఉండాలని, ఏ ఒక్కరు కూడా మిగలకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి మేలు చేయాలని సీఎం సూచించినట్లు అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి గడప గడప కు వెళ్ళేటప్పుడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు వివరించాలని మంత్రులు, పార్టీ నేతలకు జగన్ సూచించారు.
టీమిండియా క్రికెటర్ మిథాలీరాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. 23 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తెలుగుతేజం ఎన్నో విజయాలలో పాలు పంచుకున్నారు. తనకు ఇంతకాల సహకారం అందించిన బీసీసీఐ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కెరీర్ ఆసాంతం ఆటను ఆస్వాదించానని రిటైర్మెంట్‌పై ప్రకటన విడుదల చేశారు. రెండో ఇన్నింగ్స్‌కు మీ ఆశీర్వాదాలు, మద్దతు కావాలని కోరారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఐదుగురు మైనర్స్ జువెనల్స్ కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఏ-1 నిందితుడు సాదుద్ధీన్ మాలిక్ మూడు రోజుల కస్టడీకి నాంపల్లికోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 9 నుండి 11 వరకు కస్టడీలోకి అనుమతించిన నాంపల్లి కోర్టు. జూబ్లీహిల్స్ పోలీసులు రేపు చంచల్ గూడ జైల్ నుండి మాలిక్ ను కస్టడీలోకి తీసుకోనున్నారు.
టెన్త్ క్లాస్ ఫలితాలపై ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరు టీడీపీ ఆఫీసులో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు చేసిన నిరసన కార్యక్రమం రసాభాసగా మారింది. పార్టీ ఆదేశాల మేరకు చేస్తున్న కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పార్టీ కార్యాలయంలోకి రావడాన్ని తప్పుపడుతున్నారు. దిష్టి బొమ్మతో ఉన్న వ్యక్తిపై పోలీసులు దాడి చేసి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పార్టీ కార్యలయంలోకి పోలీసులు వచ్చి దాడిచేయడాన్ని యువనేతలు, మహిళా కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.
ఏపీలో టీచర్లకు మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేసిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అరకొర ఉన్న ఉపాధ్యాయులకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేసి క్యూ లైన్య నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశించగలం.. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారని ఆరోపించారు. విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు ఇచ్చి భవిష్యత్తు కాపాడాలని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ కోరారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీ కౌంటింగ్ నిర్వహించాలని, వారి వద్ద నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదని, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు తీసుకోకూడదని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
జూబ్లీహిల్స్‌లో బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు కోర్టు 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు ఏ - 1 అయిన సాదుద్దీన్ అనే వ్యక్తిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని విచారణ చేయనున్నారు.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని జూలై 5న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష చేశారు. జూలై 4న ఎదుర్కోళ్లు, 5న అమ్మవారి కళ్యాణం, 6న రథోత్సవం ఉంటుందని అన్నారు. అమ్మవారి కల్యాణాన్ని భక్తులు టీవీల్లో, ఫోన్లలో లైవ్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని వసతులూ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కాకినాడ ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం కలకలం రేగుతోంది. ట్యాంకులోని 11 వేల లీటర్లు డీజిల్ మాయమైనట్టు గుర్తించారు. అయితే, భూమి లోపల ఉండే డీజిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకయ్యిందని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన గురు భక్తి చాటుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల పరిధి కామారెడ్డి గూడెంలో కన్నుమూసిన విశ్రాంత ఉపాధ్యాయుడు, టీఆర్‌ఎస్ మండల నేత బిల్లా సోమిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఆయన తన మాస్టారు అని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాడె మోసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. సోమిరెడ్డి భౌతికకాయాన్ని మంత్రి మంగళవారం సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తాను పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉండి రాజకీయ సూచనలు, సలహాలు అందజేసిన మాస్టారు సేవలు మరువలేనివంటూ కన్నీరు పెట్టుకున్నారు.
Background
ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల కదలికలకు అవరోధం ఏర్పడింది. ఈ సంవత్సరం మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. మే 31 నాటికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చినా.. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమైంది. జూన్ 4, 5వ తేదీనే రాయలసీమను తాకాల్సి ఉండగా ఇంకా రాలేదు. నేడు లేదా రేపు నైరుతి రుతుపవనాలు ఏపీని తాకనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు.
కోస్తాంధ్ర, యానాంలో..
ఈ రోజు ఆంధ్రప్రదేశ్, యానాంలలో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. నైరుతి రుతుపవనాలు జూన్ మధ్యలో కోస్తాంధ్ర ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో జూన్ 15 తరువాత రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు అంతగా చెప్పుకోదగ్గ వర్షాలు ఉండవు. కొద్ది చోట్లల్లో మాత్రమే వర్షాలుంటాయి. పార్వతీపురం మణ్యం, పాడేరు, ఏలూరు జిల్లా, పశ్చిమ ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాలో మాత్రమే కొన్నిచోట్ల అక్కడక్కడా వర్షాలుంటాయి. మిగిలిన జిల్లాల్లో వేడి, ఉక్కపోత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడతారు. రైతులు మాత్రం పంట పొలానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుడతారు.
రాయలసీమలో వెదర్ అప్‌డేట్స్..
రాయలసీమ జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలని ఈ రోజు రుతుపవనాలు తాకనున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అది కూడా కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కురిసే ఛాన్స్ ఉంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, అన్నమయ్య (మదనపల్లి । రాయచోటి)లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. విస్తారంగా వర్షాలు ఉండవు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఎండ నుంచి ఉపశమనం లభించడం లేదు. గతేడాది కన్నా ముందుగానే వర్షాలు పడతాయని అంచనా వేయగా అలా జరగలేదు.
తెలంగాణలో వడగాల్పులు
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది తెలంగాణలో ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో మందగించిన రుతుపవనాల గమనం మళ్లీ బలం పుంజుకుని జూన్ 11 నుంచి 13 తేదీలలో తెలంగాణలోకి రానున్నాయి. హైదరాబాద్ లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండనుంది. మండు వేసవి ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. కానీ మధ్యాహ్నానికి హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పులు వీచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -