Breaking News Live Telugu Updates: దేశ వ్యాప్తంగా వీడిన చంద్ర గ్రహణం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
దేశ వ్యాప్తంగా చంద్ర గ్రహణం వీడింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5.40 గంటల నుంచి చంద్రగ్రహణం కనువిందు చేసింది. గౌహతిలో అత్యధికంగా 1.43 నిమిషాల పాటు చంద్ర గ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది.
తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం మొదలైంది. సాయంత్రం గం.5.40 నుంచి 6.19 నిమిషాల వరకు చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగానే చంద్రగ్రహణం ఏర్పడనుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు స్టే ఎత్తివేసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును విచారించవచ్చని పోలీసులను ఆదేశించింది. బీజేపీ వేసిన పిటిషన్ ను పెండింగ్ పెట్టింది హైకోర్టు.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఓఎంసీ కేసులో అరెస్టై గతంలో ఏడాది పాటు శ్రీలక్ష్మి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలక్ష్మి ఏపీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.లక్ష సాయం చేయనున్నట్లు ప్రకటించారు.
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రాయలసీమ జిల్లాల్లో ప్రధాన ఆలయాల్లో ఒకటి గా పిలవబడే కడప జిల్లా చక్రాయపేట మండల కేంద్రంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం తలుపులను మంగళవారం మూసివేశారు. మంగళవారం తెల్లవారు జామునే స్వామికి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉదయం 8:30 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. తిరిగి రేపు బుధవారం నుంచి నిత్య పూజలు, దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో ముకుందారెడ్డి, ప్రధాన అర్చకులు కేసరి స్వామి తెలిపారు.
- నిజాం కాలేజ్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన కేటీఆర్
- నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల హాస్టల్ కేటాయింపు సమస్యపై స్పందించిన మంత్రి కేటీఆర్
- ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు కేటీఆర్ భరోసా
- ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరిన కేటీఆర్
- తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని పేర్కొన్న కేటీఆర్
- ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ కు సూచన
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా అతని పరిస్థితి విషమంగా ఉంది. కౌటాల పోలీస్ స్టేషన్లో 2020 బ్యాచ్ గుడిపేట బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ సూర రజనీకుమార్ (29) విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమయ్యింది. బులెట్ తల భాగం నుండి దూసుకుపోయింది. రజినీకుమార్ స్వగ్రామం బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి.. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గన్ మిస్ ఫైర్ అయిందా.. లేక రజినీకుమార్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారా అనే కోణంలో సైతం విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అతన్ని కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమిస్తుండటంతో హైదరాబాద్ కు తరలించారు. జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దే స్వామి, ఆసుపత్రికి చేరుకుని డాక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలోనే వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా మారిపోయింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. మొదట నవంబర్ 8న ఈ అల్పపీడనం ఏర్పడుతుందని భావించినా.. 9న ఏర్పడుతుందని అప్ డేట్ ఇచ్చారు వాతావరణశాఖ అధికారులు. ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు యానాంపై దీని ప్రభావం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీలంక తీరం వెంట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఆపై వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. అల్పపీడనం ఏర్పడిన 48 గంటలకు ఇది బలహీనపడి పుదుచ్చేరి, చెన్నై మధ్య నవంబర్ 11, 12 తేదీల్లో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనం తుఫానుగా మారుతుందా, లేదా సాధారణ అల్పపీడనంగానే ఉంటుందా అనే అంశంపై గురించి ఇంకా క్లారిటీ లేదని ఏపీ వెదర్ మ్యాన్ చెప్పారు. కానీ అల్పపీడనం ఏర్పడ్డాక తప్పకుండా తమిళనాడు వైపు అయినా, పుదుచ్చేరి, లేక దక్షిణ కోస్తాంధ్ర వైపు రానుందని అంచనా వేశారు. ఒకవేళ ఇది వాయుగుండంగా మారితే తమిళనాడుకి, అలాగే బలమైన తుఫానుగా ఏర్పడితే దక్షిణ కోస్తాంధ్రపై పెను ప్రభావం చూపనుందని తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 34.8 డిగ్రీలు నమోదు కాగా, హకీంపేటలో అత్యల్పంగా 16 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నవంబర్ 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
హైదరాబాద్ లో చలి తీవ్రత పెరుగుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘాలతో కప్పేసి ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. మరోవైపు నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం గాలుల కోస్తాంధ్ర వైపుగా వీస్తుండటంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సైతం కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిశాయి. ఉమ్మడి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వర్ష సూచ ఉంది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుందని అధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడ్డాక మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర తెలిపింది. చెన్నైకి దగ్గరగా ఉన్నతమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలతో ఈ సీజన్ లో అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -