Breaking News Live Telugu Updates: పలాసలో వర్షాల ధాటికి కుప్పకూలిన రెండస్తుల భవనం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 06 Oct 2022 09:10 PM
పలాసలో వర్షాల ధాటికి కుప్పకూలిన రెండస్తుల భవనం 

శ్రీకాకుళం జిల్లా పలాసలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న ఇళ్ల గోడలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. కూలిపోయిన బిల్డింగ్ లో ఉదయం పూట టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది.  టిఫిన్ సెంటర్ సంబంధించి సామాగ్రి మొత్తం ఆ బిల్డింగ్ శిథిలాల కింద నుజ్జునుజ్జు అయ్యాయి. 

Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ - బలయ్, హాజరైన మెగాస్టార్

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రఘునందన్ రావు, వీహెచ్, విద్యాసాగర్ రావు, కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా నాయకులను పిలిచి అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఏటా బండారు దత్రాత్రేయ నిర్వహించే సంగతి తెలిసిందే.

Vikarabad Rains: వికారాబాద్‌లో కొట్టుకుపోయిన కారు, చెట్టును పట్టుకొని డ్రైవర్ రాత్రంతా ఎదురు చూపులు

వికారాబాద్ జిల్లాలో వరద నీటిలో ఓ కారు డ్రైవరు చిక్కుకుపోయాడు. వరద నుండి తృటిలో తప్పిన ప్రమాదం తప్పినా సరే, వేరే దారి లేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రాత్రంతా చెట్టు మీదనే వేలాడుతూ సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. వికారాబాద్ జిల్లాలో నాగారంలో వరద నీటిని దాటుతుండగా ఒక కారు, అందులోని ప్రయాణికులతో పాటు కొట్టుకుపోయింది. కారు డ్రైవర్ నీటి ప్రవాహాన్ని గుర్తించకుండా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. కారు డ్రైవరు నీటి ప్రవాహాన్ని గుర్తించకుండా ప్రవాహాన్ని దాటడానికి ప్రయత్నించాడు. కానీ వరద నీటి ధాటికి కారు కొట్టుకుపోయింది. వెంటనే కారు డ్రైవరు చెట్టును పట్టుకున్నాడు. మిగిలిన ఇద్దరూ ఈదుకుంటూ బయటపడ్డారు. అనంతరం కేకలు వేయడంతో గ్రామస్తులు చెట్టుపై నుంచి డ్రైవర్‌ను రక్షించారు.

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం, 7 కిలోలు పట్టేసిన అధికారులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. ఏకంగా 7 కిలోల వరకూ బంగారం పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ.3.50 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా వేశారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద ఈ బంగారం పట్టుబడింది. కడ్డీల రూపంలో ఈ బంగారం తరలిస్తుండగా పట్టుకొని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Srikakulam: వాగులో గల్లంతైన ఒకరి శవం లభ్యం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబిరిగాం వాగులో  నిన్న సాయంత్రం గల్లంతైన ఇద్దరు యువకులలో శంకరరావు మృతదేహం లభ్యం అయింది. కేదారిపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూర్మారావు మృతదేహం కోసం పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది గాలిస్తున్నారు.

TRS: నేడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీఆర్ఎస్ నేతలు

  • నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీఆర్ఎస్‌ నేతల బృందం

  • ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్‌ పార్టీ కీలక నేతలకు ఈసీ అపాయింట్‌మెంట్‌

  • బీఆర్ఎస్‌ పేరు తీర్మానాన్ని ఈసీకి ఇవ్వనున్న నేతలు

  • నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

Background

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్‌లో చివరిసారి వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. రెండో ఆవర్తనం నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం అవుతుందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. నేటి నుంచి రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి.
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 6 నుంచి 8 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.


అక్టోబరు 6 ఉదయం 5 గంటలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడనుంది. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉదయం 7 గంటల  నుంచి వర్షాలు మొదలు కానున్నట్లుగా అంచనా వేశారు.


ఈ జిల్లాలకు వాతావరణ వాతావరణ అధికారులు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. మరోవైపు, హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ఏపీపై మూడు, నాలుగు రోజులపాటు ప్రభావం చూపనుంది. నేటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, అల్లూరిసీతామరాజు, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి (అక్టోబర్ 6) తరువాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో  వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం మరింత బలపడటంతో రేపటి నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడతాయి. కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.