Breaking News Live Telugu Updates: ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 05 Jul 2022 07:36 PM
గత ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడింది- ప్రకటించిన ఏపీ హౌస్ కమిటీ

ఏపీలో గ‌త‌ ప్ర‌భుత్వం కావాల‌నే డేటా చౌర్యానికి పాల్ప‌డినట్టు హౌస్ కమిటీ ప్రకటించింది.. ప్ర‌భుత్వం ర‌హ‌స్యంగా ఉంచాల్సిన డేటాను ప్ర‌యివేట్ వ్య‌క్తుల‌కు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించింది హౌస్ కమిటీ.....రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే డేటా చౌర్యానికి పాల్ప‌డిన‌ట్లు క‌మిటీ గుర్తించింది...రేపు జ‌రిగే స‌మావేశంలో కీల‌క నిర్న‌యం ప్ర‌క‌టించ‌నుంది కమిటీ.....

టీమ్‌ఇండియా దశాబ్దాల ఆశలు గల్లతు - సిరీస్‌ సమం

ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీసు గెలవాలన్న టీమ్‌ఇండియా ఆశలు అడియాసలే అయ్యాయి! ఎడ్జ్‌బాస్టన్‌లో 388 పరుగుల టార్గెట్‌ను స్టోక్స్‌ సేన అలవోకగా ఛేదించింది.

తీగల కృష్ణారెడ్డి కామెంట్స్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి రియాక్షన్

మహేశ్వరం నియోజకవర్గంలో కబ్జాలను ప్రోత్సహిస్తున్నారే తప్ప.. అభివృద్ది చేయడం లేదన్న టీఆర్‌ఎస్‌ లీడర్‌ తీగల కృష్ణారెడ్డి కామెంట్స్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి రియాక్షన్ అయ్యారు. ఇలా మిస్‌గైడ్‌ చేసేలా ఎందుకు మాట్లాడుతున్నారో కనుక్కుంటామని అన్నారు. కబ్జాలు జరిగి ఉంటే సీఎం చర్యలు తీసుకుంటారన్నారు. 

RK Roja Comments On Pawan Kalyan: జనసేన జాకీలు విరిగిపోతున్నాయి - ఆర్కే రోజా

తూర్పు గోదావరి జిల్లాలో ఏపీ టూరిజం శాఖ మంత్రి అర్కే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీపై సెటైర్లు వేశారు. రోజురోజుకు క్షీణిస్తున్న తెలుగుదేశం పార్టీని పైకి తేవడానికి ఉపయోగిస్తున్న జాకీలు విరిగిపోతున్నాయి అంటూ జనసేనను ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి గత 3 సంవత్సరాలుగా వివిధ ఎన్నికల్లో వైఎస్ఆర్ విజయభేరిని చూసి తలవొంచుకుంటున్నారని అన్నారు. 


వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 3 సంవత్సరాల్లోనే దాదాపుగా అమలు చేయగలిగిందని అన్నారు. ప్రభుత్వం భీమవరంలో చారిత్రాత్మక అల్లూరి సీతారామరాజు కార్యక్రమం సక్సెస్ కావడాన్ని చూసి భీమ్లా నాయక్ కు మతి భ్రమించిందని రోజా ధ్వజమెత్తారు. 


తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ ల కాంబినేషన్ లో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని రోజా పిలుపునిచ్చారు.

Jagananna Vidya Deevena: కర్నూలులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం, ప్రసంగిస్తున్న సీఎం

ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు కూడా కార్పొరేట్ విద్యను అందించే ఉద్దేశంతో వారికి అన్ని వసతులు కల్పిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఈ మేరకు మూడో ఏడాది కూడా జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ వేడుక జరిగింది. వేసవి సెలవుల తర్వాత నేడు ఏపీలో స్కూళ్లు ప్రారంభం కానున్న సందర్భంగా ఈ కిట్లు అందిస్తున్నారు.


స్కూలు మొదలయ్యే నేటి నుంచి నెలాఖరు వరకూ ఈ కిట్లను అందిస్తారు. ప్రతి విద్యార్థికి ఇచ్చే ఈ కిట్ లో ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ (కుట్టుకూలితో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్‌ (తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఉండే) టెక్ట్స్ బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందిస్తుంది. ఈ ఒక్కో కిట్‌ విలువ దాదాపు రూ.2 వేలు. ఇందుకోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. ఈ విద్యా సంవత్సరం కోసం రూ.931.02 కోట్లు ఖర్చు పెడుతోంది.

Telangana Police Transfers: తెలంగాణలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు

  • తెలంగాణలో 6 డీఎస్పీల బదిలీలు 

  • సంగారెడ్డి SDPO గా రవీందర్ రెడ్డి 

  • వైరా ఏసీపీగా రహమాన్ 

  • మల్కాజిగిరి ఏసీపీ గా నరేష్ రెడ్డి 

  • డీఎస్పీలు బాలాజీ, సత్యనారాయణ, శ్యామ్ ప్రసాద్ లను చీఫ్ ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలంటూ డీజీపీ ఆదేశాలు

Nalgonda Inter Student Suicide: ఫెయిల్ అయ్యానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

నల్గొండ: ఇంటర్ ఫెయిల్ అయ్యానని మనస్థాపంతో మాడుగులపల్లి మండలం గుర్రప్ప గూడెంకు చెందిన పిట్టల కార్తీక్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్గొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందడంతో విషాదం నెలకొంది.

Balkampet Yellamma Kalyanam: కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం

హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి కళ్యాణాన్ని  మంత్రులు కుటుంబ స‌మేతంగా తిలకించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

Narayana Murthy's Mother Passes Away: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి మాతృవియోగం

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి మాతృవియోగం కలిగింది. రౌతులపూడి మండలం మల్లంపేటలో రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు.

Hyderabad News: హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం చేసింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొంది, ఆపై డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

Balkampeta Yellamma: నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు అమ్మవారి కల్యాణం, బుధవారం రథోత్సవం సందర్భంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. మరోవైపు ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎల్లమ్మ కళ్యాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి, నైరుతి బంగాళాఖాతం నుంచి సైతం 50 కిలోమీటర్ల వేగంతో తీరంలో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సోమవారం నాడు హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల హెచ్చరిక, వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు ఓ మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని సైతం హెచ్చరిస్తూ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ఇప్పుడు పశ్చిమ పసిఫిక్ కి వెళుతోంది. దాంతో జూలై రెండు, మూడు వారాల్లో రెండు నుంచి మూడు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షం కురుస్తుండగా, మిగతా ప్రాంతాల్లో చినుకులు కూడా పడవు.


హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేడు కొమరం భీమ్ ఆసిఫాబాద్,  జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం సాయంత్రం, రాత్రి హైదరాబాద్ లోని పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మణికొండ​, లింగంపల్లి, జూబ్లీ హిల్స్, కూకట్‌పల్లి, బేగంపేట, సికింద్రాబాద్, పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.