Breaking News Live Telugu Updates: టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కు 14 రోజులు రిమాండ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఏ1గా ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు బండి సంజయ్ ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఏప్రిల్ 19 వరకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దాంతో బండి సంజయ్ ను ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయన్ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రాపోల్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. పాలకుర్తి ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను వరంగల్ పీటీసీకి తరలించి.. అక్కడ్నుంచి కోర్టు వెనుక గేటు నుంచి ఆయనను లోపలికి తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ముందు భారీగా గుమిగూడిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు.
టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసులో ఏ1గా బండి సంజయ్, ఏ2గా ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ5గా శివ గణేష్ అని రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అర్ధరాత్రి ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఆయన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఫోన్ చేసి, బండి సంజయ్ ఉన్న పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాలని చెప్పినట్లుగా సమాచారం.
Background
నిన్న విదర్భ నుండి ఉన్న ద్రోణి /గాలి విచ్చిన్నతి, ఈ రోజు జార్ఖండ్ నుండి ఇంటీరియర్ ఒరిస్సా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మి ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షంలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది మరియు ఎల్లుండి కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది.
Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షంలు అక్కడక్కడ మరియు ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో )కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 64 శాతం నమోదైంది.
ఏపీలో వర్షాలు ఇలా
‘‘నేడు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నమోదవనుంది. ప్రస్తుత పరిస్ధితులను గమనించినట్లు అయితే అధిక పీడన ప్రాంతం తెలంగాణ మీదుగా కొనసాగుతోంది. దీని వలన రాయలసీమ జిల్లాల్లో వేడి గాలులు విస్తారంగా మధ్యాహ్నం, సాయంకాలం కొనసాగుతుంది కాబట్టి, నంధ్యాల, కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో వేడి గాలులు కొనసాగనుంది. కానీ కోస్తాంధ్రలో కాస్త భిన్నంగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్.టీ.ఆర్., కొనసీమ, కృష్ణ, ప్రకాశం జిల్లాలోని తూర్పు భాగాలు, నెల్లూరు జిల్లాలోని తూర్పు భాగాలు, తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నేడు నమోదుకానున్నాయి.
రాయలసీమలో ఎండలు విపరీతంగా
రాయలసీమలో ఎండలు విపరీతం అవ్వనున్నాయి. నేడు అత్యధికంగా కర్నూలు నగరంలో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. కర్నూలుతో పాటుగా చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. కర్నూలు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశం వ్యాప్తంగా ఎండల తీవ్రతలో నేడు అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఢిల్లీలో వాతావరణం ఇలా
గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైన ఢిల్లీలో మంగళవారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రాజధానిలో ఇలాంటి నిలకడ లేని వాతావరణం గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ కనిపిస్తోంది. ఏప్రిల్‌లో కురిసిన వర్షాలకు పశ్చిమ ఒడిదుడుకులే కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. కానీ పర్యావరణవేత్తలు ఈ దుర్భరమైన వాతావరణాన్ని వాతావరణ మార్పుల రూపంగా పరిగణిస్తున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -