Breaking News Live Telugu Updates: నల్కొండ జిల్లాలో కాల్పుల కలకలం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Nalgonda News : నల్కొండ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. మునుగోడు మండలం ఊగొండి శివారులో బైక్ పై వెళ్తున్న యువకుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఈ కాల్పుల్లో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ములుగు మంగంపేట మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టెల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ కింద యువకుడు, ఇద్దరు చిన్నారులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. కలుషిత ఆహారం తిని విద్యార్థుల అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మెస్ లో మధ్యాహ్నం భోజనంలో కుళ్లిన క్యాబేజీ పెట్టడంతో వాంతులు, విరోచనాలు అయ్యాయని విద్యార్థులు అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మెస్ కాంట్రాక్టర్లు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే అధికారులు జ్వరాలు ప్రబలి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు. ఫుడ్ పాయిజన్ జరగలేదంటున్నారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం (Police Command Control Room) ప్రారంభోత్సవం ఇక్కడ లైవ్‌లో చూడండి.
దేశానికి ఆదర్శంగా ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. మొత్తం ఏడు ఎకరాల్లో విభిన్నమైన అధునాతన నిర్మాణ శైలితో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను ఈ కేంద్రం నుంచి నియంత్రించే వీలుంటుంది. అందుకోసం అతిపెద్ద డిజిటల్ వాల్ కూడా ఇందులో ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 లో మొత్తం రూ.600 కోట్లతో ప్రభుత్వం ఈ కేంద్రాన్ని నిర్మించింది. ఈ భవనంలోని టవర్ ఏ అధికంగా 20 అంతస్తులు ఉంటుంది. 18వ అంతస్తులో పోలీస్ కమిషనర్ కార్యాలయం కూడా ఉంటుంది.
హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డులోని సీసీటీవీ కెమెరాలు, మెట్రోస్టేషన్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను సైతం సీసీసీతో అనుసంధానించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ సీసీటీవీ వీడియోనైనా ఇక్కడి నుంచి చూసే వీలుంటుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో అతి భారీగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. మంత్రులు, పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న కేసీఆర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత పండితుల వేద మంత్రోఛ్చారణల మధ్య, గుమ్మడికాయలతో దిష్ఠి తీస్తూ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు.
- విశాఖ పోలీస్ కమీషనర్ ఆఫీస్ కి చేరుకున్న టీడీపీ నేతలు
- సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి మృతిపై అనుచిత పోస్ట్ లపై ఫిర్యాదు
- సోషల్ మీడియాలో లో లోకేష్ పై అసత్య పోస్ట్ పెట్టిన దేవేంద్ర రెడ్డిపై ఫిర్యాదు ఇచ్చిన టీడీపీ నేతలు
- లోకేష్, చంద్రబాబుపై వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ట్రోలింగ్ పై ఫిర్యాదు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు పేరకి 75 సంవత్సరాల స్వాతంత్య్ర సంబరాలలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా చాలా మంది జాతీయ జెండాపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కానిస్టేబుల్ సత్యనారాయణ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ జెండాని చేతబట్టుకొని ట్రాఫిక్ ని క్రమ బద్దీకరిస్తున్నారు. మువ్వెన్నల జెండా గొప్పతనాన్ని వాహానదారులకి వివరిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ తిరంగా జెండా తో విధులు నిర్వహించడం సోషల్ మీడియా వైరల్ అవుతుంది.
ఏపీ హైకోర్టులో కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం కొత్త జడ్జిలు గురువారం ఉదయం బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారితో ప్రమాణం చేయించారు. కొత్త జడ్జిలుగా జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, జస్టిస్ బండారు శ్యాంసుందర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రమాణస్వీకారం చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం భానూరులో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తల్లి రేఖ (28), కుమార్తె(2), రేఖ మరిది బాసుదేవ్ (27)గా గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలని స్థానికులు చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా వీరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
- తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామ శివారులోని పరమేషు బయోటెక్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో బ్రాయిలర్ క్లీన్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులకు అస్వస్థత
- కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇద్దరు వ్యక్తులు మృతి
- మృతులు డొమా బీరువా (23) ఒడిశా, గాజుల శ్రీను (26) తిరుగుడు మెట్ట గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు
- మరో వ్యక్తి పరిస్థితి విషమం
- సరైన భద్రతా ప్రమాణాలు చేపట్టకుండా కార్మికులను బ్రాయిలర్ క్లీనింగ్ కు పంపడంతో ఆక్సిజన్ అందక అస్వస్థకు గురైనట్లు సమాచారం
అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణంలో కొత్త బ్రిడ్జి కింద మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే గత కొద్దిరోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. డ్యామ్ ల గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. అందులో భాగంగా నేడు చాగల్లు డ్యామ్ ద్వారా నీటిని కిందకు వదలడంతో పెన్నానది ఉదృతంగా ప్రవహిస్తోంది. అది తెలియని మతిస్థిమితం లేని వ్యక్తి బ్రిడ్జి కింద నిద్రిస్తుండంతో నీటి దాటికి ప్రవాహంలో కొట్టుమిట్టాడుతుండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కొత్త బ్రిడ్జి వద్దకు చేరుకొని సహాయ చర్యలు ముమ్మరం చేసి మతిస్థిమితం లేని వ్యక్తిని కాపాడారు. ఈ రెస్క్యూ అపరేషన్ లో అగ్నిమాపక సిబ్బంది పట్టణ పోలీసులు పాల్గొన్నారు.
Background
ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ తీరంలో కోస్తా తమిళనాడు మరియు పరిసర ప్రాంతాలపై తుపాను ప్రసరణ ఇప్పుడు పశ్చిమ, మధ్య మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో ఏపీలో వాతావరణ పరిస్థితులు ఇలా ఉండే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది.
Telangana Weather: తెలంగాణలో ఇలా
హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు నేడు (ఆగస్టు 4) ఉదయం వెల్లడించిన వివరాల మేరకు వచ్చే 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో వచ్చే 3 గంటల్లో అత్యధిక వర్షం కురవనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇక నిన్న తెలంగాణలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని ఎండలు కూడా అధికంగా ఉన్నాయి. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి,హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని నిన్న వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే 10 గ్రాములకు రూ.200 తగ్గింది. వెండి ధర మాత్రం రూ.500 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,440 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.63,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.63,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,440గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.63,000 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -