Breaking News Live Telugu Updates: బీజేపీ ముక్త భారత్ కోసం ఉద్యమించాలి: కేసీఆర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
దేశంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అందుకే బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఒకేతాటిపై ఉన్నామన్నారు. ఎన్నికల్లో నాయకత్వం ఎవరు వహిస్తారో తర్వాత చర్చిస్తామన్నారు.
సోనియా మాతృమూర్తి పోలా మైనో ఇటలీలో ఈనెల 27న కన్నుమూత. మంగళవారం అంత్యక్రియలు ముగిసినట్టు ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్.
అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబులో సస్పెన్షన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనపై అక్రమంగా కేసులు బనాయించారన్న కానిస్టేబుల్ ప్రకాశ్ ఆరోపణలతో ఎస్పీపై కేసు నమోదైంది. ఎస్పీతోపాటు ఏఆర్ అడిషినల్ ఎస్పీ హనుమంతు, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్‌బాషాపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ అనంతపురం జిల్లా అధికారులతో విచారిస్తే మళ్లీ విమర్శలు వస్తాయని గ్రహించిన డీజీపీ.. వేరే జిల్లా అధికారులతో విచారించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బిహార్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర రాజధాని పట్నాకు చేరుకున్నారు. మరికాసేపట్లో బిహార్ ముఖ్యమంత్రితో కలిసి గాల్వాన్ అమర సైనికుల కుటుంబాలకు, మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు, చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పట్నాకు బయలుదేరారు. అక్కడ గల్వాన్ లోయలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో ప్రాణాలు కోల్పోయిన బిహారీ కుటుంబాలకు రూ.5 లక్షలు అందించనున్నారు. బిహార్ సీఎం నితీశ్ తో సమావేశమై జాతీయ రాజకీయాల గురించి చర్చించనున్నారు.
హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఫిలింనగర్ లోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆలయ ప్రాంగణాన్ని పూలతో సర్వాంగ సుందరంగా సిబ్బంది అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కోసం ఈఓ సతీష్ రాజు, చైర్మన్ వెంకన్నబాబు రాజు అన్ని ఏర్పాట్లు చేశారు. చవితి మహోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి వివిధ పళ్ళరసాలతో శ్రీ రుద్రాభిషేకం, లక్ష దూర్వార్చన, గణపతి కల్పము, గణపతి హోమము కార్యక్రమములను అర్చకులు నిర్వహించనున్నారు.
Background
ఉపరితల ఆవర్తనం తమిళనాడు దాని పరసర ప్రాంతాలు, పశ్చిమ విదర్శ, తెలంగాణ, రాయలసీమలపై కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలు, తమిళనాడు అంతర్భాగంలో సుముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, దక్షిణ వైపు వంగి ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి పైకి వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం.
తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగరిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి మెదక్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసింది.
నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ లో ఉదయం చల్లగా ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మార్పుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో అంతంతమాత్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడగా.. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. అయితే భారీ వర్ష సూచన లేదు. తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం పడుతుంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కడప, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ (బుధవారం) రూ.100 పెరిగి రూ.47,250 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ.110 పెరిగి రూ.51,540 గా ఉంది. స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.100 పెరిగి రూ.60,100 కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు (బుధవారం) రూ.100 పెరిగి రూ.47,250 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం కూడా రూ.110 పెరిగి రూ.51,540 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.60,100 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,540 గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్, విజయవాడ తరహాలోనే కిలో రూ.60,100 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -