Breaking News Live Telugu Updates: జగిత్యాలలో ఉద్రిక్తత, బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిర్మల్ వెళుతున్న బండి సంజయ్ ను జగిత్యాల దాటాక పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలను ఉంచి బండి సంజయ్ ను పోలీసులు చుట్టుముట్టారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అనకాపల్లి జిల్లా యలమంచిలి జాతీయరహదారిపై పోతురెడ్డిపాలెం జంక్షన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మొదట స్కూటీ పై వెళ్తున్న ఒకరిని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత మరో ఇద్దరిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. విశాఖ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తూ ముగ్గురిని కారు ఢీకొట్టింది. మృతులలో ఇద్దరు కిర్లంపూడికి చెందిన మొల్లేటి శివాజీ, భీశెట్టి కుమారిగా పోలీసులు గుర్తించారు. మరొకరు యలమంచిలి మండలం పద్మనాభరాజు పేటకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతులు మొల్లేటి శివాజీ, భీశెట్టి కుమారిలు అన్నాచెల్లెళ్లుగా తెలుస్తోంది.
హన్మకొండ జిల్లా మడికొండ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉరివేసుకుని కిరణ్ రాజు అనే ఏడోతరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతని పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. హాస్టల్ లో ఇతర విద్యార్థులు కొట్టడంవల్లే కిరణ్ రాజు ప్రాణాపాయ స్థితికి చేరాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై హాస్టల్ సిబ్బంది నోరు మెదపడం లేదు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి పాయకరావు పేట నియోజకవర్గంలోని డీఎల్ పురం గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములతో ప్రయాణిస్తున్న బస్సు శనివారం అర్ధరాత్రి ఒంగోలులో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలవ్వగా మరో 18 మంది స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నం డీఎల్ పురంలో ఇరుముళ్ళు వేసుకున్న స్వాములు రాత్రి విజయవాడ చేరుకున్నారు. అనంతరం బయలుదేరి ఒంగోలు చేరుకోగా అకస్మాత్తుగా వీరు ప్రయాణిస్తున్న బస్సు సాంకేతిక సమస్యలతో ప్రమాదానికి గురైనట్లుగా స్వాములు చెపుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా డీఎల్ పురం స్వాములు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాధానికి గురైందన్న సమాచారంతో గ్రామస్తులు ఆందోళన చెందినప్పటికీ స్వాములందరూ క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు పాదయాత్ర చేపట్టినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడ్డగుట్ట డివిజన్ లో పలు బస్తీలలో అధికారులతో కలిసి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ప్రధానంగా రోడ్లు డ్రైనేజీ మురుగునీరు మంచినీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.. రెండు పడక గదుల ఇల్లు ఇంకా రాలేదని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని తెలిపారు.. అధికారులతో కలిసి ప్రజా సమస్యలను పూర్తిగా తెలుసుకున్న అనంతరం వాటి పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. న్యాయవాదుల దీక్షకు బిజెపి నాయకుడు అక్కు శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ కోర్టు విషయమై ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులను పట్టించుకోకుండా, గజ్వేల్ లో ఏర్పాటు చేస్తామంటున్నారని, హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు, కక్షిదారులకు హుస్నాబాద్ లోనే సబ్ కోర్టు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గజ్వేల్ లో సబ్ కోర్ట్ ఏర్పాటు చేస్తారనే విషయం స్థానిక ఎమ్మెల్యేకు ముందే తెలిసిన తనపై వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కు న్యాయవాదులను తీసుకెళ్లి వినతి పత్రం ఇచ్చేలా కంటి తుడుపు చర్యలకు పూనుకున్నారని ఆరోపించారు. న్యాయవాదులను వినోద్ కుమార్ వద్దకు తీసుకెళ్లిన టిఆర్ఎస్ నాయకులు ఈ విషయమై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు హుస్నాబాద్ కు ఆర్డీవో ఆఫీస్ వచ్చేందుకు న్యాయవాదులు సైతం పార్టీలకతీతంగా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బదిలీపై వెళ్లిన ఆర్డీవో స్థానంలో కొత్త ఆర్డివో ఇంతవరకు చేరకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా నాటకాలు మానుకొని పార్టీలకతీతంగా న్యాయవాదులు చేస్తున్న దీక్షను గుర్తించి, హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు కృషి చేయాలన్నారు.
కార్పొరేట్ సెలూన్ లకు వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లా RDO కార్యాలయం ముందు గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయి బ్రాహ్మణులకు వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మరియు సీపీఎం, సీపీఐ నాయకులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల కులవృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక జీవో తీసుకురావాలని అన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూతవీడు దూరంలో నాయి బ్రాహ్మణులు దీక్ష చేస్తుంటే, స్థానిక ఎమ్మెల్యేకు కనబడడం లేదా అని స్థానిక ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు.
నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయి బ్రాహ్మణులు తమ డిమాండ్స్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అమరేందర్ కృష్ణకు మెమోరాండం అందజేశారు.
కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ నగర్ లో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఎస్పీఐ ఏటీఎంలోకి చొరబడి దొంగలు దోపిడీకి యత్నించారు. సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేసి ఏటీఎం పగలకొడుతుండటంతో సైరన్ మోగింది. ఈ క్రమంలో కంట్రోల్ రూమ్ కి సమాచారం అందడంతో జీడిమెట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీసుల రాకను పసిగట్టి దుండగులు పరారయ్యారు.
Background
ఈ నెలాఖరులోపు ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండం అవుతుందని భావిస్తున్నారు. దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తూర్పు కోస్తాలోని ఉమ్మడి విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తీర ప్రాంతాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. వర్షాల తీవ్రత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వరకూ ఉంటుందని తెలిపారు.
‘‘ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలను ఆంధ్రప్రదేశ్ లో చూడగలము. ప్రస్తుతం విశాఖ నగరంలో మోస్తరు వర్షాలు తగ్గుముఖం పట్టాయి, అనకాపల్లి, గాజువాక వైపు మాత్రం కాసేపు వర్షాలు కొనసాగి తగ్గుముఖం పట్టనుంది. మరో వైపున ఈ వర్షాలు బంగాళాఖాతంలో కనిపిస్తున్న ఉపరితల ఆవర్తనానికి తేమను ఇస్తూ ఉంది. దీని వలన మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి అక్కడక్కడ మాత్రమే - కొనసీమ, కాకినాడ, ఎన్.టీ.ఆర్., కృష్ణా, బాపట్ల, గుంటూరు, ఉభయ గోదావరి, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో వర్షాలను చూడగలము. అక్కడక్కడ మాత్రమే కాబట్టి మా ఇంటి మీద లేదు, మా ఊరిలో లేదు అనకండి. ఈ రోజు దక్షిణ ఆంధ్రలో తక్కువగానే వర్షాలుంటాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో నేటి (నవంబరు 27) నుంచి వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత మాత్రం పెరుగుతుందని అంచనా వేశారు. తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వచ్చే రెండు రోజులు చలి మరింత పెరుగుతుందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఇలా
‘‘హైదరాబాద్ లో క్లియర్ స్కైట్. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 17 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.న
వివిధ చోట్ల చలి ఇలా..
నిన్న తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటోందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ణ ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతోంది. ఈ జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.
నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కనిష్ణ ఉష్ణో్గ్రతలు 15 డిగ్రీలకు మించి నమోదవుతుండడంతో ఇక్కడ ఎలాంటి అలర్ట్ లు జారీ చేయలేదు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -