Breaking News Live Telugu Updates: సీఎం జగన్‌ను కలిసి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Oct 2022 04:25 PM
రాజాసింగ్‌కు షాక్- పీడీ యాక్ట్‌ను సమర్థించిన అడ్వైజరీ బోర్డు

బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను సమర్థించిన పీడీ అడ్వైజరీ బోర్డు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. తనపై పీడీ చట్టం ఎత్తేయాలని రాజాసింగ్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. 

సీఎం జగన్‌ను కలిసి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు. గతంలో టికెట్‌ల వివాదం చెలరేగినప్పుడు కూడా ఆయన ఓసారి సీఎంతో సమావేశమయ్యారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమా తీశారు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. వైసీపీ స్పాన్సర్డ్‌ సినిమాగా టీడీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా వీళ్లిద్దరు భేటీ కావడంతో మరోసారి సినిమాల ప్రస్తావన తెరపైకి వచ్చింది. 

టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం- ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌లూయిస్  ప్రకారం విజేతను ప్రకటించారు. ఈ రూల్స్ ప్రకారం ఆట ఆగిపోయే సరికి ఐర్లాండ్‌ కంటే ఇంగ్లండ్‌ 5 పరుగులు వెనుక ఉంది. అందుకే ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ 157 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద వర్షం స్టార్ట్ అయింది. ఇకపై వర్షం ఆగే పరిస్థితి లేనందున డకవర్త్‌ లూయిస్ ప్రకారం విజేతను ప్రకటించారు. 14.3 ఓవర్లు వద్ద మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఐర్లాండ్‌ 110 పరుగులు చేసింది. అప్పటికి ఇంగ్లండ్ ఐదు పరుగులు వెనుక ఉండటంతో ఇర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. 

Mancherial News: మంచిర్యాల జిల్లాలో ఓ ఏస్సై వీరంగం

మంచిర్యాల జిల్లాలో ఓ ఏస్సై వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఓ ఎస్ఐతోపాటు ఆయన అనుచరుల వీరంగం సృష్టించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ ప్రాంతంలోని రోడ్ పై మంగళవారం అర్ధరాత్రి మద్యం సేవించిన మందు బాబులు, రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. మద్యం సేవిస్తున్న వారిలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి అనుచరులు ఉన్నారు. ఇబ్బందులకు గురైన వాహనదారులు 100 డయల్ కు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి బ్లూ కోర్టు పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు విచారణ చేపట్టే సమయంలో ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోం గార్డులపై మందు బాబులు దాడికి పాల్పడ్డారు. ఇద్దరు కానిస్టేబుల్స్, హోం గార్డులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Mettuguda Blast: మెట్టుగూడలో పేలిన సిలిండర్

సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్  దూద్ బావిలో ఒక  ఇంట్లో  గ్యాస్ సిలిండర్ పేలి 9 మందికి  తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందని సమాచారం.  మరొకరు చనిపోయారు. భారీగా పేలుడు  ఘటనకు కారణం గ్యాస్ సిలిండర్ అని తెలుస్తుంది. సంఘటన   స్థలానికి చేరుకున్న కార్పొరేటర్  రాసూరి సునీత, చిలకలగూడ  పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని  గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగింది. పేలుడు ప్రభావంతో  చుట్టుపక్కల  ఇంట్లో కూడా గోడలు పగిలాయి.

Ambati Rambabu in Tirumala: శ్రీవారి సేవలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు

తిరుమల శ్రీవారిని ఏపీ జలవనరులు శాఖా‌మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అంబటి రాంబాబు స్వామి వారి‌ సేవలో‌ పాల్గోని‌ మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరమ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శన భాగ్యం అద్భుతంగా జరిగిందని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో ఒక్కటి కూడా తగ్గకుండా 175 సీట్లి వైసీపికి రావాలని స్వామి వారిని కోరుకున్నట్లి ఏపి మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Munugode News: ఈనెల 30న చండూరులో కేసీఆర్ సభ, ఈ మరుసటి రోజే బీజేపీ

అక్టోబరు 30న చండూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. అదే విధంగా మరుసటి రోజు 31న మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు అవనున్నారు.

Background

సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.


శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండం అవుతుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. నైరుతి రుతుపవనాల కాలం అయిపోయింది. ఇక ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలోనే మొదలవుతాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్ధితులు వర్షాలకు అనుకూలంగా మారతాయి.  


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
సిత్రాంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు కురవకపోయినా చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో చినుకు కూడా పడటం లేదు. నేడు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
వాతావరణ శాఖ ముందుగా తెలిపినట్లే సిత్రాంగ్ తుపాను ఏపీపై ప్రభావం చూపలేదు. సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటడంతో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను ముప్పు ఏపీపై లేనప్పటికీ, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు పడతాయి. ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 70 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
శ్రీలంక, తమిళనాడుల మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మరో రెండు రోజుల తరువాత దీని ప్రభావం ఏపీపై ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలోనూ వర్షాలు లేవు. ఇక్కడ కూడా సిత్రాంగ్ తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. రోజురోజుకూ చలి తీవ్రత అధికం కానుంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.