బీజేపీ వరంగల్‌ సభకు హైకోర్టు అనుమతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Aug 2022 04:48 PM
బీజేపీ వరంగల్‌ సభకు హైకోర్టు అనుమతి

వరంగల్‌ బీజేపీ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా రేపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నారు. 

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌పై అనర్హత వేటు?

మైనింగ్ అక్రమకేటాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటు పడినట్టు తెలుస్తోంది. సోరెన్ ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు అయినట్టు సమాచారం అందుతోంది. ఈసీ సిఫార్సుతో గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి. ఈ సంఘటనతో కాంగ్రెస్‌ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జార్ఖండ్‌లో రాజకీయం సంక్షోభం ఏర్పడినట్టు తెలుస్తోంది. 

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని అప్పీల్ చేసిన తెలంగాణ సర్కార్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేసుకోవచ్చని ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జి అనుమతించారు. అందుకోసం పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను సింగిల్ జడ్జి సస్పెండ్ చేశారు. అయితే, ఈ సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను ప్రభుత్వం సవాలు చేస్తూ లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్ పై అత్యవసర విచారణ చేయాలని సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ అప్పీలుపై మధ్యాహ్నం 1.15 విచారణ చేపట్టేందుకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అంగీకరించింది.

Kuppam News: కుప్పంలో మళ్ళీ మొదలైన బ్యానర్ల రచ్చ

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకే పల్లిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ నేతలు ధ్వంసం చేసారు. డీకే పల్లెలో బ్యానర్లు ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు అనవసరంగా టీడీపీ నేతలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Kuppam News: కుప్పంలో కొనసాగుతున్న చంద్రబాబు మూడో రోజు పర్యటన

కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. గత రెండు రోజులుగా కుప్పంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నారా చంద్రబాబు బాబుకి 12+12 ఎన్.ఎస్.జీ కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం‌. అయితే చంద్రబాబు నాయుడు మూడో రోజు గుడిపల్లె మండలంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద భారీ పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ భరత్ ను ఇంటి నుండి బయటకు రాకుండా కట్టడి చేయడంతో పాటుగా వైసీపీ నేతలను పూర్తి స్ధాయిలో ఎక్కడిక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనీఖీ చేసిన తర్వాతే వాహనాలను అనుమతిస్తున్నారు పోలీసులు.

Chandrababu Security: టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

చిత్తూరు : టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు..


జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం ప్రభుత్వం.. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భధ్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు చేయగా, నిన్ననే అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టిడిపి కేంద్ర కార్యాలయాన్ని ఎన్.ఎస్.జీ డిజీ స్వయంగా పరిశీలించారు.. అంతే కాకుండా టిడిపి కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు వంటివి అధికం అయ్యాయి.. ఈ నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై ఎన్.ఎస్.జీ ప్రత్యేక దృష్టి సారించింది.. కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేస్తున్న చంద్రబాబుకి 12+12 భధ్రత ఏర్పాటు చేసింది..

సుప్రీం కోర్టు నుంచి తొలిసారి ప్రత్యక్ష ప్రసారం

తొలిసారి సుప్రీం కోర్టు నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ లాస్ట్‌ వర్కింగ్‌ డే సందర్భంగా...ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Old City High Alert: పాత బస్తీలో హై అలర్ట్, 4 వేల మంది భద్రతా బలగాల మోహరింపు

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు అనంతర పరిణామాల వేళ హైదరాబాద్ పాతబస్తీ‌లో హైఅలర్ట్ నడుస్తోంది. ఉద్రిక్తతలు, ఘర్షణలు జరగకుండా దాదాపు 4 వేల మంది భద్రతా బలగాలను మోహరించారు. నేడు శుక్రవారం కావడంతో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా నిఘా కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ ఫోర్స్‌ను ఉంచారు. ఫలక్‌నుమా, చంద్రాయన్ గుట్ట అలియాబాద్, శాలిబండ, మొగల్‌పురా, హుస్సేన్ అలం, పట్టార్ గడ్డి, మదీనా దారుషిఫా, డబ్బీర్ పుర, మురిగి, చౌక్ మిరాల మండి తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Bandi Sanjay: నేడు ప్రారంభం కానున్న బండి సంజయ్ యాత్ర

  • కాసేపట్లో ప్రారంభం కానున్న బండి సంజయ్ మూడవ విడత "ప్రజా సంగ్రామ యాత్ర"

  • ఇవాళ స్టేషన్ ఘనపురం నియోజకవర్గం, ఉప్పుగల్ సమీపంలోని పాదయాత్ర శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర"

  • ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు నేడు యాత్ర

  • ఇవాళ నాగాపురం సమీపంలో బండి సంజయ్ రాత్రి బస

Jeedimetla: కొరియర్ వచ్చిందని ఘరానా మోసం, జీడిమెట్లలో దారుణం

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని ఉడ్స్ కాలనీ ఓ ఇంట్లో దుండగుడు ఘరానా మోసానికి ప్రయత్నించాడు. కొరియర్ వచ్చిందని ఓ కేటుగాడు ఇంటి తలుపు తట్టాడు. తాము ఎలాంటి ఆర్డర్ పెట్టలేదని మాట్లాడుతున్న సమయంలోనే ఇంట్లోకి వెళ్లి ఓమహిళ (35) మెడపై కత్తిపెట్టి బెదిరించాడు. అయితే, బాధితురాలు తన మెడలో మంగళసూత్రం తీసుకోవాలని తనని చంపొద్దని వేడుకుంది. ఆమె అరుపులతో స్థానికులు అలర్ట్ అవుతారని భయపడి తనతో ఉన్న టేపును బాధితురాలి నోటికి చుట్టి కేటుగాడు పరారయ్యాడు. బాధితురాలి భర్త రామచంద్రరావు (40) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తుపాను వాయుగుండం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, యానాంలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఆగస్టు 30 వరకు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ కావడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
  
తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం ప్రభావం తెలంగాణపై కొనసాగుతూనే ఉంది. వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. నేడు సైతం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో మరికొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. రాష్ట్రంలో గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి..


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆగస్టు 28 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఏపీలోని రాయలసీమపై ప్రభావం చూపుతోంది. నేడు రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 27, 28 తేదీల్లోనూ రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 28 వరకు రాయలసీమ ప్రాంతానికి ఎల్లో అలర్ట్ జారీ చేసి, అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


బంగారం, వెండి ధరలు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు మరింత పెరిగింది. 10 గ్రాములకు ఏకంగా రూ.250 పెరిగింది. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.200 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,500 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,820 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.61,100 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.61,100 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,500 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,820 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.61,100 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.