Breaking News Live Telugu Updates: సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఏపీ నేతలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 02 Jan 2023 07:59 PM
సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన రావెల, చంద్రశేఖర్ 

సీఎం కేసీఆర్ సమక్షంలో ఏపీ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 


 

పవన్ విజ్ఞప్తితో దీక్ష విరమించిన హరిరామజోగయ్య 

మాజీ ఎంపీ హరిరామజోగయ్య దీక్ష విరమించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. జనసేన నేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తితో హరిరామజోగయ్య దీక్ష విరమించారు. 

రేవంత్ రెడ్డి అరెస్ట్ , బొల్లారం పీఎస్ వద్ద ఉద్రిక్తత 

హైదరాబాద్ బొల్లాలం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పీఎస్ కు తరలించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రేవంత్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీల సర్పంచుల ధర్నాకు కాంగ్రెస్ యత్నించింది. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 
 

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ రివిజన్ పిటిషన్ కొట్టివేత 

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ కు ఎదురుదెబ్బ తగిలింది. సిట్ రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. బీఎల్ సంతోష్ జగ్గుస్వామి,  తుషార్, శ్రీనివాస్ ను నిందితులగా చేర్చాలని ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. ఈ మెమోను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లింది సిట్. హైకోర్టులో కూడా సిట్ కు చుక్కెదురైంది. 

Bhupalpalli District: ప్రిన్సిపాల్ ను బదిలీ చెయ్యాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన విద్యార్థినులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉదయం గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. కాటారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యార్థినులు క్లాసులు మానేసి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ చైతన్య వేధింపులు తట్టుకోలేకపోతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. ప్రిన్సిపాల్ ను బదిలీ చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపాల్‭ను బదిలీ చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థినులు భీష్మించారు. తమకు ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వడం లేదని.. కనీసం దెబ్బలు తగిలినా ఇంటికి పంపించడం లేదని వాపోయారు. ఇలాంటి ప్రిన్సిపాల్ తమకు వద్దంటూ ఆందోళన చేస్తున్నారు.

Kadapa: దేవుని గడప లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం

తిరుమల తొలి గడప దేవుని గడప లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం వైభవంగా ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 5 గంటలకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు. వైకుంఠ దర్శనం కోసం భారీ ఎత్తున భక్తులు తెల్లవారు జామున 3 గంటల నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు శ్రీనివాసుడు దర్శనం ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు, పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు.

Vaikunta Ekadasi: వైకుంఠంను తలపించేలా శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ

వైకుంఠ ఏకాదశికి తిరుమల పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా టిటిడి‌ అధికారులు అలంకరించారు.. శ్రీవారి ఆలయ మహద్వార గోపురంతో పాటు ప్రాకారం, ధ్వజస్తంభం, ఉత్తర ద్వారంలో ప్రత్యేక విద్యుత్‌ అలంకరణలు చేశారు. ఆలయంలో ఐదు టన్నులు, వెలుపల ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలతో అలంకరణ చేశారు.. మరో లక్ష కట్‌ ఫ్లవర్స్‌తో ఆలయంలోని ధ్వజస్తంభాన్ని, బలిపీఠం, ఉత్తర ద్వారాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు.. మహద్వారం గోపురానికి శంఖు, చక్ర, నామాల నడుమ పుష్పాలతో తయారు చేసిన మహావిష్ణువు, లక్ష్మీదేవి దేవతామూర్తుల కటౌట్‌ ఏర్పాటు చేశారు.. ముఖ్యమైన ప్రాంతాల్లోని పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి.. ఆలయం ముందు ఏర్పాటు చేసిన 'వైకుంఠ మండపం' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. శ్రీ మహా విష్ణువుతో పాటు అష్టలక్ష్మీ, దశావతారాల ప్రతిమలను మండపంలో ఏర్పాటు చేశారు.. 30 వేల కట్‌ఫ్లవర్స్‌తో పాటు టన్ను సంప్రదాయ పుష్పాలతో మండపాన్ని అలంకరించారు..‌ శ్రీ మహా విష్ణువుతో పాటు అష్టలక్ష్మీ, దశావతారాల ప్రతిమలను మండపంలో ఏర్పాటు చేశారు.. 30 వేల కట్‌ ఫ్లవర్స్‌తో పాటు టన్ను సంప్రదాయ పుష్పాలతో మండపాన్ని అలంకరించారు.. ఆలయం ముందు గొల్ల మండపం వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారు, గ్లోబు విద్యుత్‌ ప్రతిమలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో మహారాష్గ సీఎం

వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండే దర్శించుకున్నారు.. సోమవారం వేకువజామున కుటుంబ సమేతంగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం ఆయనకు టిటిడి‌ అధికారులు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Revanth Reddy House Arrest: రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్టు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్టు, ఇంటి వద్ద పోలీసుల మోహరింపు


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ మోహరించిన పోలీసులు


పోలీసు వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకొని భారీగా పోలీసులతో ఇంటి చుట్టూ పహారా కాస్తున్న పోలీసులు


ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై టీపీసీసీ ధర్నాకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో అనుమతిని రద్దు చేసిన పోలీసులు


అనుమతి ఇవ్వకున్నా ధర్నా చేస్తామని  తెలంగాణ పీసీసీ ప్రకటన

Background

ఆంధ్రప్రదేశ్‌, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్ లో ఈశాన్య దిశ (నార్త్ ఈస్ట్) నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 5 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని జనవరి 1 నాటి వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. మొత్తానికి వాతావరణానికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


మరోవైపు, ఏపీలో ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చలిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళలో చలి కాస్త పెరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.


మన్యం జిల్లాలో పెరుగుతున్న చలి
మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మూడు రోజులుగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలంలో నాలుగు రోజుల నుంచి అర్ధరాత్రి నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఎడతెరిపి లేకుండా పొగ మంచు ఉంటుండడంతో పెసర, మినుము పంటలకు తీరని నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. తురకపేట, డొంకల బడవంజ, కృష్ణాపురం, దబ్బపాడు, శ్యామలాపురం, చింతలబడవంజ, రావిచెంద్రి తదితర గ్రామాల్లో అపరాల సాగు చేస్తున్నారు. ఈ పంటలపై పొగ మంచు ప్రభావం తీవ్రంగా ఉంటోందని రైతులు పేర్కొంటున్నారు. మామిడి తోటలు కూడా పూత దశలో ఉన్నందున పొగ మంచు కారణంగా పూత మాడిపోతోందని, దీంతో పంట దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.


పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ మూడు జిల్లాలకు మాత్రం వచ్చే 5 రోజుల పాటు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుంచి గాలులు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 19.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.