Breaking News Live Telugu Updates: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియామకం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేశారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆ మేరకు కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ దిల్లీ హైకోర్టు సీజేగా బదిలీఅయ్యారు.
జగిత్యాలలో రైతుసంఘం ధర్నాలో ఉద్రిక్తత
జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ను నెట్టివేసిన రైతు సంఘం నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ మధ్య జరిగిన చెరకు రైతుల అరెస్ట్ కు నిరసనగా జగిత్యాల చౌరస్తాలో ధర్నా చేపట్టిన రైతు సంఘం నాయకులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న డిఎస్పీ ప్రకాష్ వారితో మాట్లాడటానికి ప్రయత్నించగా దురుసుగా వ్యవహరించి తోసేసిన తిరుపతి రెడ్డి
దీంతో స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఈ మధ్య కేటీఆర్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం చేసిన పలువురు చెరకు రైతులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా ధర్నా చేపట్టిన రైతు నాయకులు
తెలంగాణ వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతుండటంతో ఎట్టకేలకు తాను ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని బావిస్తున్నట్లు తన మనసులో మాట వెల్లడించింది. ఈ మేరకు పాలేరులో సాగుతున్న పాదయాత్రలో వివరాలు వెల్లడించింది. పార్టీ ఏర్పాటు నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రధానంగా దృష్టి సారించిన షర్మిల కార్యక్రమాలు సైతం ఎక్కువగా ఇక్కడే ఉండేటట్లు ప్రణాళికలు చేసుకున్నారు. పార్టీ ప్రకటించిన అనంతరం ఏర్పాటు చేసిన తొలిసభను ఖమ్మంలోనే ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే పాలేరు నియోజకవర్గంలో పాగా వేసేందుకు పూర్తిగా సిద్దమయ్యారు.
హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అగ్ని పథ్ స్కీమ్ ను రద్దు చేయాలంటూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జగ్గా రెడ్డి, శ్రీధర్ బాబు, మహేష్ గౌడ్, అంజన్ కుమార్, వీహెచ్, మల్లు రవి, రాములు నాయక్, కోదండరెడ్డి, సునీతారావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబ్రిగాంలో ఉద్రిక్తత నెలకొంది. ఈనాం భూముల వ్యవహారంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. 317.57 ఎకరాల భూమి విషయంలో చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. 1956 ఈనాం యాక్ట్ ప్రకారం రైతులకు 166 ఎకరాలు రైతులకు ఇవ్వాలని తీర్పు వచ్చింది. 108 ఎకరాలు పంచి 58 ఎకరాలు పెండింగ్ లో పెట్టడంతో వివాదం మొదలైంది. రైతులపై మాజీ సర్పంచ్ వర్గీయుల చేసిన దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఆదివారం ఉదయం ఎలుగుబంటి దాడిలో కలమట కోదండ రావు(50) మృతి చెందాడు. రోజూ మాదిరిగా ఉదయం నిద్ర లేచిన కోదండ రావు గ్రామ సమీపంలో ఉన్న తోటకు వెళ్తుండగా సమీప పొదల్లో దాగివున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆయన పై దాడి చేసింది.
ఎలుగు బారిని నుంచి రక్షణకోరకు గట్టిగా కేకలు వేయడంతో, కేకలు విన్న గ్రామస్తులు వచ్చేసరికి ఎలుగు అక్కడ నుండి పారిపోయింది.తీవ్ర గాయాలుతో ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సిరిసిల్ల పట్టణంలో రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్‌తో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, టన్నెల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే రైతు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో మున్సిపల్ సిబ్బంది తీరును అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు చింతకాయల రాజేశ్ ఖండించారు. మున్సిపల్ కమిషనర్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని చెప్పారు. ల్యాండ్ పర్మిషన్ ఇచ్చాకే కట్టామని రాజేశ్ తెలిపారు. న్యాయంగా ఇల్లు కట్టుకున్నామని.. ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని రాజేశ్ ఆరోపించారు. అధికారులు మాత్రం ఆక్రమణలో ఉన్నందునే కూల్చివేశామని చెబుతున్నారు.
మరోవైపు అయ్యన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులతో కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.పంట కాల్వను ఆక్రమించి నిర్మించారంటూ నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో రెండు సెంట్లు ఆక్రమించారంటూ మున్సిపల్ కమిషనర్ పేరిట ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఆందోళనలకు వ్యతిరేకంగా జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాలు, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంత మంది అభ్యర్థులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అల్లర్ల వెనక ఉన్న కొన్ని ప్రైవేటు డిఫెన్స్ అకాడమీ యాజమాన్యాల కుట్ర ఉందనే కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతోంది. ఇప్పటికే కీలక నిందితుడు ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Background
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఆదివారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. యానాంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పల్నాడు, పాడేరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడతాయని సైతం వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రుతుపవనాల ప్రభావంతో నేడు సైతం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో గాలుల అసహజత ఉండటం వలన ఈ రోజు కూడా ఉదయం లేదా రాత్రివేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం జిల్లాల్లొ విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల వర్షపు నీరు అక్కడే నిలిచిపోయి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరో 3 గంటల్లో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, వికారాబాద్, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -